ప్రపంచ దేశాలను ఉక్కిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది చనిపోయారు. ఈ మహమ్మారి సోకితే మరణం తప్పదనే అపోహా కొందరిలో ఉంటే... చిన్న పిల్లలు, వృద్ధులపై దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటదని వైద్యులు చెబుతోన్నారు. కాని కరోనాపై ప్రజలల్లో ఉన్న అనుమానాలన్నీ కేవలం కల్పితాలేనని... కరోనాతో పోరాడి, జయించి నిరూపించారు వారిద్దరు. కొవిడ్-19 బారిన పడి కోలుకున్న మొదటి చైనా మహిళ, ఇటలీలో కొవిడ్-19ను జయించిన వందేళ్ల బామ్మ ఇందుకు ఉదాహరణలు.
ఈమెతో మొదలైంది!
వూహాన్ నగరంలోని హువానాన్ అనే సీ ఫుడ్ మార్కెట్ నిత్యం కిటకిటలాడుతుంది. వినియోగదారులతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బిజీగా ఉండే ఆ ప్రాంతం ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. అక్కడ ప్రాణం పోసుకున్న కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్నే విస్మయానికి గురిచేస్తోంది.
కరోనా బారినపడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కోట్లాదిమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ మార్కెట్ నుంచే ఈ వైరస్ విజృంభణ మొదలైందని శాస్త్రవేత్తలు తేల్చారు. తొలిసారి ఈ వైరస్ ఓ మహిళకు సోకిందని, ఆమె ద్వారా ఇతరులకు వ్యాప్తిచెందిందని తాజాగా ‘ద వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘పేషెంట్ జీరో’ గా పిలుస్తున్న ఆమే... చైనాకు చెందిన 57 ఏళ్ల వీ గ్లూక్సియన్.
- వీ గ్లూక్సియన్ రోజూ వేకువజామునే నిద్రలేచి, మార్కెట్‌కి చేరుకుంటుంది. అక్కడున్న తన స్టాల్‌లో పచ్చి రొయ్యలను, మాంసాన్ని విక్రయిస్తుంది. స్టాల్‌లో తాను తెచ్చిన సరకంతా అయిపోయిన తరువాతే ఇంటికి వెళ్తుంది. ఎప్పటిలాగే గతేడాది డిసెంబరు 10న స్టాల్ మూసేసి ఇంటికి బయలుదేరింది. అప్పటికే ఒళ్లునొప్పులు, జలుబు లక్షణాలు కనిపించాయి. సాయంత్రానికి ఆ అస్వస్థత జ్వరంగా మారడంతో దగ్గర్లో ఉండే క్లినిక్‌కు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు సాధారణ జ్వరానికిచ్చే ఇంజెక్షనిచ్చి పంపేశాడు. ఇదొక వైరస్ అని, త్వరలో ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుందని ఆ వైద్యుడు ఊహించలేదు. మరుసటి రోజుకి అనారోగ్యం తగ్గుముఖం పట్టలేదు సరికదా, మరింత ఎక్కువయ్యేసరికి గ్లూక్సియన్ అదే ప్రాంతంలోని ఎలెవెన్త్ ఆసుపత్రిలో చూపించుకుంది.
చికిత్సకు స్పందించలేదు...
రెండు వారాలు గడిచినా, గ్లూక్సియన్‌కు అనారోగ్యం తగ్గుముఖం పట్టలేదు. దానికితోడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. ఇదేదో తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందేమో అని భయపడిన ఆమె కుమార్తె, తక్షణం వూహాన్‌లో అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న యూనియన్ ఆసుపత్రికి డిసెంబరు 16న గ్లూక్సియన్‌ను తరలించింది. అక్కడి వైద్యులు ఆమెకు పరీక్షలు చేస్తూ చికిత్స అందిస్తున్నా... ఫలితం కనిపించలేదు. అంతలో ఆమె కుమార్తెతోపాటు, ఆమె స్టాల్ పక్కనుండే వ్యాపారులందరూ ఇలాంటి సమస్యలతోనే ఆసుపత్రికి చేరుకోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది.
అలా గుర్తించారు...
వైద్యపరీక్షలు, పరిశోధనల తరువాత గ్లూక్సియన్ అనారోగ్యానికి కారణమైన కరోనా వైరస్‌ను వైద్యులు గుర్తించారు. తక్షణం ఆమెను క్వారంటైన్‌లో ఉంచారు. ఇతరులతో సంబంధం లేకుండా వ్యాధినిరోధక మందులను అందిస్తూ ఆమెను పర్యవేక్షించడం మొదలుపెట్టారు. ఈలోపు నగరమంతా వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో తక్షణం సీ ఫుడ్ మార్కెట్లను మూసివేయించారు. దాదాపు 30 రోజుల తరువాత ఆమె పూర్తిగా కోలుకుంది. 50 రోజులపాటు ఈ మహమ్మారితో పోరాడి గెలిచిందామె.
మాంసాహారం విక్రయిస్తున్న రోజుల్లో నాకు ఈ వైరస్ సోకింది. మొదట జలుబుతో మొదలై, జ్వరం వచ్చింది. ఆ తరువాత ఊపిరి తీసుకోలేక పోయా. ఇంతలో నా కుమార్తెకు, నాతోపాటు మార్కెట్‌లో పనిచేసే చాలామందికి ఇదే తరహా అనారోగ్యం రావడం వైద్యులను ఆలోచించేలా చేసింది. చాలా రోజులపాటు అనారోగ్యంతో ఉన్నా. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులాడా. ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుట పడింది. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి’
102 ఏళ్ల వయసులో బయటపడ్డ బామ్మ
కరోనా వైరస్ కారణంగా ఎవరైనా హాస్పిటల్‌లో చేరితేనే భయంగా ఉంటుంది. అదికూడా పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్న ఇటలీలో అయితే? ఆ చేరింది కూడా 102 ఏళ్ల పెద్దావిడ అయితే..? సాధారణంగా ఎవరైనా ఆశలు వదిలేసుకుంటారు. దానికి విరుద్ధంగా ఇటలీలోని జెనోవా నగరానికి చెందిన 102 ఏళ్ల బామ్మ ఇటాలికా గ్రొండోనా మాత్రం ఇరవై రోజులపాటు కరోనా మహమ్మారితో వీరోచితంగా పోరాడి క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ సిక్‌బాల్ఢీ. ‘కరోనాతో పోరాటం చేస్తోన్న వృద్ధుల్లో గ్రొండోనా ఎన్నో ఆశలను నింపుతోంది’ అంటున్నాడు.
కొన్ని రోజుల క్రితం స్పల్పంగా గుండెనొప్పి రావడంతో గ్రొండోనా ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో దానికీ చికిత్స చేశారు. గ్రొండోనా 1917లో జన్మించింది. ఆమె పుట్టిన ఏడాదికే ‘స్పానిష్ ఫ్లూ’ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమందిని పొట్టన పెట్టుకుంది. అలా ఏడాది వయసులోనే పెద్ద గండం నుంచి బయటపడిందామె. దశాబ్దాల కిందటే కొడుకు చనిపోయినా... ఆ విషాదం నుంచి మెల్లగా బయటపడింది.
జీవితాన్ని అమితంగా ప్రేమించే ఈ బామ్మకు సంగీతం, నృత్యం అంటే ఎంతో ఇష్టమట. బ్రిటిష్ గాయకుడు ఫ్రెడ్డీ మెర్క్యురీ అంటే ప్రాణమట. ఇటాలియన్ మోటర్ సైకిల్ రోడ్ రేసర్ వేలంటినో రోసి అన్నా ఎంతో ఇష్టమట. ఆమెకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే... మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో పుట్టి, రెండో ప్రపంచ యుద్ధాన్ని చూసింది... దీంతోపాటు రెండు భయంకరమైన వైరస్ మహమ్మారులనూ జయించింది.
ఇదీ చూడండి: కరోనా గురించి మీరు విన్న వాటిలో ఏది నిజం?