ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు తితిదే చర్యలు చేపట్టింది. గతంలో భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే సర్వదర్శన టోకెన్లు జారీ చేసేవారు.. తాజాగా విష్ణు నివాసం వసతి గృహంలోనూ టికెట్ల జారీని ప్రారంభించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు వచ్చే యాత్రికుల కోసం విష్ణు నివాసంలో టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీ, కరోనా నేపథ్యంలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల సెంటర్లను తితిదే పెంచింది.
విష్ణునివాసంలో 24 గంటల పాటు సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటించిన తితిదే...భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 3 వేల నుంచి 10 వేల వరకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని తెలిపింది. దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తుండగా.. సర్వదర్శనానికి సంబంధించి ఒకరోజు ముందుగా టికెట్లను జారీ చేస్తున్నారు.