తిరుమలలో శ్రీవారి భక్తులకు సంప్రదాయ భోజనం వితరణను తితిదే ప్రయోగాత్మకంగా చేపట్టింది. తిరుమల అన్నమయ్య భవనంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆహార వితరణ ప్రారంభించారు. వచ్చే నెల 8 వరకు ఉచితంగా ఆహారాన్ని అందజేసి భక్తుల అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నారు.
గోవుల ఉత్పత్తులతో గోవిందునికి గో ఆధారిత నైవేద్యం సమర్పిస్తున్న తితిదే.. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలతో అల్పాహారం, భోజనం భక్తులకు అందుబాటులోకి తెస్తోంది. లాభాపేక్ష లేకుండా ఆహార పదార్థాల తయారీకి వ్యయం చేసిన మొత్తాన్ని మాత్రం భక్తుల నుంచి వసూలు చేసేలా తితిదే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. భక్తుల అభిప్రాయాలు, సూచనలు సేకరించి వచ్చే నెల 8 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
దేశీయ ఆవు నెయ్యి, బెల్లం, గానుగ నూనెతో వంటలు వండి భక్తులకు వడ్డిస్తున్నారు. కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా తయారు చేసి అందించారు. మధ్యాహ్నం కొబ్బరి అన్నం, పులిహోర, పూర్ణాలు, పచ్చి పులుసు, దోశకాయ పప్పు తదితర 14 రకాల వంటకాలు భక్తులకు అందించారు.
ఇదీ చదవండి: MINISTER SABITHA: 'పూర్తిగా కొవిడ్ నిబంధనల నడుమ పాఠశాలల నిర్వహణ'