వేసవిలో విద్యుత్ వినియోగంపై యాక్షన్ ప్లాన్‌కు విద్యుత్ శాఖ సిద్ధమవుతోంది. రాబోయే వేసవిలో ఏమేరకు వినియోగం పెరగబోతుంది? అందుకు తగ్గట్లు ఏవిధంగా సమాయత్తమవ్వాలి? మనకున్న వనరులేంటి? వాటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి? తదితర అంశాలపై ఎస్పీడీసీఎల్ పరిధిలోని 15 జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో వారం రోజుల పాటు సుధీర్ఘంగా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి.. ఆయా జిల్లాల ఎస్ఈ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారులతో సమీక్షా నిర్వహించనున్నారు. పవర్ ట్రిప్పింగ్, నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవిలో విద్యుత్ వినియోగం ఎంతవరకు పెరిగే అవకాశముంది? తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను వినియోగదారులకు అందించడంలో భాగంగా విద్యుత్ శాఖ ఈ సమావేశాలు నిర్వహిస్తుందని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. ఈ సమావేశాలతో అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుందని విద్యుత్ శాఖ భావిస్తోంది.
ఇవీ చూడండి: కొత్తగా ఐదు గనుల నిర్మాణ ప్రణాళికకు సింగరేణి బోర్డు ఆమోదం