రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం బస్సులు దొరక్క అవస్థలకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఛార్జీల నుంచి కూరగాయల వరకు అన్ని ధరలు కొండెక్కాయి.
సగమైనా తిరగడం లేదు...
తెలంగాణ వ్యాప్తంగా 44 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సగం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రోజువారీగా ట్రిప్పుల్లో సగమైనా తిరగడం లేదు. ఆటోలు, జీపులు తదితర వాహనాలను విద్యార్థులు ఆశ్రయించాల్సిన పరిస్థితి. సుమారు 8 లక్షల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో పాసుల ద్వారా పాఠశాలలు, కళాశాలలకు హాజరవుతుంటారు.
ఎప్పుడొస్తాయో..ఎప్పుడు పోతాయో తెలీదు..?
పాసుల పునరుద్ధరణ 45శాతం తగ్గినట్లు అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల హాజరు 10-12 శాతం వరకు వ్యత్యాసం వస్తుంది. పట్టణ ప్రాంతాల్లో హాజరులో పెద్దగా వ్యత్యాసం లేదు. సొంత బస్సుల్లో కాస్తంత అటూ ఇటుగా 50 శాతం వరకు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రోజు వారీగా ప్రకటిస్తోంది. ఆ బస్సులు ఎన్ని ట్రిప్పులు తిరుగుతున్నాయన్నది ప్రశ్నగా ఉంది. తాత్కాలిక డ్రైవర్లకు అవగాహన, సమయపాలన లేకపోవటమే కారణమని పేర్కొంటున్నారు.
ఆర్టీసీ సమ్మె -కొండెక్కిన కూరగాయలు
ఆర్టీసీ సమ్మె ప్రభావం కూరగాయల ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. టమాటా వంటి సాధారణ కూరగాయలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్‌లోని రైతుబజార్లకు కూరగాయలు నిత్యం తేవడం ఆనవాయితీ. సమ్మెతో సగం వ్యాపారం నిలిచింది. ఇతర రాష్ట్రాల నుంచి బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్ తదితర టోకు మార్కెట్లకు లారీల్లో తెస్తున్నారు. వాటిని కొన్న టోకు వ్యాపారులు చిల్లర వ్యాపారులకు మరింత ధర పెంచి అమ్ముతున్నారు. మళ్లీ చిల్లర వ్యాపారులు కమీషన్‌తో కలిపి ధరలు పెరిగాయి.
ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సు గాలి తీసిన కార్మికులు