'ఛలో ట్యాంక్‌బండ్' దృష్ట్యా ఆర్టీసీ ఐకాస నేతలను పోలీసులు ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేశారు. హిమాయత్ నగర్ లిబర్టీ కూడలి వద్ద ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేసి లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీక్ష కార్యక్రమానికి అఖిలపక్ష నేతలు కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
నాయకుల అరెస్టులు
అంబర్‌పేట్‌లో మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ, భాజాపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు
నగరంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పలు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని పలు మార్గాల్లో వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరికొన్ని మార్గాల్లో రాకపోకలను మళ్లించారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. లిబర్టీ, ట్యాంక్‌బండ్ పైకి వచ్చే అవకాశం ఉన్న అన్ని మార్గాలను తమ అధీనంలోకి తీసుకున్నారు.