ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా గాజువాక వాసి పరుచూరి మల్లికార్జునరావుకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల ఫిర్యాదుతో నోటీసులు అందించారు. ఓ టీవీ షోలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. కరోనా వైరస్‌తో ప్రతి ఇంట్లో ఒక మనిషి చనిపోతారంటూ మల్లికార్జునరావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వివరణ కోరినప్పటికీ మల్లికార్జునరావు స్పందించకపోవడం వల్ల... హైదరాబాద్ సూల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు గాజువాక పోలీసులను సంప్రదించారు. గాజువాకలోని అల్లూరి టవర్స్‌లో ఉన్న మల్లికార్జునరావుకు నోటీసులు అందజేశారు.
నిరాహార దీక్ష
కరోనా మహమ్మారి నుంచి బాధితులను కాపాడుతున్నందుకు... కొంతమంది తనపై కక్షసాధిస్తున్నారని మల్లికార్జునరావు ఆరోపించారు. తను నివాసం ఉంటున్న ఇంటివద్దే నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా బాధితులకు సేవ చేస్తున్నందుకు తనను, తన వాలంటీర్లను ఫోన్ల ద్వారా భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే వాట్సాప్.. టెలిగ్రామ్ బ్లాక్ చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: CRIME: అనుమానంతో చంపి.. కరోనాను వాడుకుని.. చివరికి...