TRS Counter Attack on BJP : హైదరాబాద్ కేంద్రంగా జాతీయకార్యవర్గం, బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్న భాజపా వ్యూహాల్ని తిప్పికొట్టేలా గులాబీపార్టీ ప్రణాళిక చేస్తోంది. ప్రధాని మోదీ సహా కీలక నేతలు 3 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండేలా భాజపా ఏర్పాట్లు చేస్తుంటే కేంద్రంపై విరుచుకుపడేందుకు ఇదే సరైన సమయంగా తెరాస భావిస్తోంది.
తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని.. తీవ్ర వివక్ష చూపుతోందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహ రచనచేస్తోంది. బయ్యారం ఉక్కుపరిశ్రమ వంటి విభజన హామీలు అమలు చేయలేదని కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, సాగునీటిప్రాజెక్టులకు జాతీయహోదా, విద్యాసంస్థలు, వైద్యకళాశాలల మంజూరులో వివక్ష చూపుతోందని కొంత కాలంగా తెరాస ఆరోపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణను అవమానపరుస్తుంటే భాజపా రాష్ట్రనేతలు వంతపాడుతున్నారన్న కోణంలో ప్రచారానికి సిద్ధమవుతోంది అదే విషయాన్ని పల్లె నుంచి దిల్లీ వరకూ భాజపా వైఖరిపై నినదించనున్నారు. ప్రజల్లో కేంద్ర వైఫల్యాలను.. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర సర్కార్ వ్యవహారశైలి గురించి వివరించనున్నారు.
వివిధఅంశాలపై కేంద్రానికిలేఖలు రాయాలని రాష్ట్ర మంత్రులు భావిస్తున్నారు. పలు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించనున్నారు. ప్రధాని, ఇతరముఖ్యనేతలు నగరంలో ఉన్నప్పుడు నిరసనవ్యక్తం చేయడం వల్ల దేశవ్యాప్తంగా ప్రచారం వస్తుందనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఈనెల 21 లేదా 22న తెలంగాణ భవన్‌లో తెరాస విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
భాజపా వ్యూహాలను ఎలా తిప్పి కొట్టాలనే విషయాలపై.. దిశానిర్దేశం చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపైనా విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటో పార్టీ నేతలకు వివరించనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై.. నేతల సూచనలు స్వీకరించనున్నారు.