దిల్లీకి వెళ్లి కేంద్రాన్ని మరోసారి నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రేపు దిల్లీకి మంత్రుల బృందం వెళ్లనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెరాస విస్తృతస్థాయి భేటీలో.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రైవేటీకరణ, ఇతర అంశాలపై భేటీలో చర్చించిన సీఎం.. కేంద్రంపై పోరులో భవిష్యత్తు కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం చర్చించారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 20న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెరాస తరఫున నిరసనలు చేయాలని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు.
రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు..
తెరాస ఎంపీలతో కలిసి ఆరుగురు మంత్రుల బృందం దిల్లీకి వెళ్తున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులను రాష్ట్ర మంత్రుల బృందం కలవనుందన్నారు. రైతుబంధు పథకంపై ఎలాంటి ఆంక్షలు లేవని మంత్రి ఉద్ఘాటించారు. రైతుబంధు అందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. రైతుబంధు పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని.. వరి వేస్తే పెట్టుబడి ఇవ్వరనేది దుష్ప్రచారమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్ర నిధులతో నిర్మించామన్నారు. కాళేశ్వరానికి నిధులు ఇవ్వలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే చెప్పిందని గుర్తుచేశారు. రైతులు గతంలో కంటే ఈసారి ఇతర పంటలు ఎక్కువగా వేస్తున్నారన్నారు. పొద్దు తిరుగుడు విత్తనాల కొరత దేశవ్యాప్తంగా ఉందన్నారు. వచ్చే ఏడాది విదేశాల నుంచైనా పొద్దు తిరుగుడు విత్తనాలు తెప్పిస్తామన్నారు. మిల్లర్లతో ఒప్పందం చేసుకున్న రైతులే వరి వేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్రానిది బాధ్యతారాహిత్య వైఖరి..
"ధాన్యం సేకరణపై కేంద్ర ఇచ్చిన లక్ష్యం ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో సేకరించాల్సిన ధాన్యం ఇంకా చాలా ఉంది. ఇంకా సగం పంట కల్లాలు, పొలాల్లోనే ఉంది. మిగతా ధాన్యాన్ని ఏం చేయాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తాం. దిల్లీకి వెళ్లి కేంద్రాన్ని మరోసారి నిలదీయాలని భావిస్తున్నాం. రేపు తెరాస ప్రతినిధుల బృందం దిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తుంది. రా రైస్ ఎంతైనా కొంటామన్న కేంద్రం.. ఇప్పుడు ఎందుకు కొనట్లేదు. కేంద్ర ప్రభుత్వానిది బాధ్యతారాహిత్య వైఖరి. మరోవైపు గోదాములు, వ్యాగన్లు ఖాళీ లేవంటూ ఎఫ్‌సీఐ బియ్యం తరలించట్లేదు. రాష్ట్రంలో 65 లక్షల హెక్టార్లలో పంట దిగుబడి వచ్చింది. కేంద్రం ఈసారి వానాకాలంలో ధాన్యం కొనుగోలు కోటాను భారీగా తగ్గించింది. కేంద్ర నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నారు. రైతు సమస్యలపై పార్లమెంట్‌లో మా సభ్యులు పోరాటం చేస్తున్నారు. కేంద్ర నిర్ణయాలను ఎంపీలు ఉభయసభల్లో నిలదీస్తున్నారు. వరి వేస్తే పెట్టుబడి ఇవ్వరని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు. అందరికీ ఇస్తాం. మిల్లర్లతో ఒప్పందం చేసుకున్న రైతులే వరి వేస్తున్నారు. గతంలో కంటే ఈసారి ఇతర పంటలు ఎక్కువగా వేస్తున్నారు." -నిరంజన్‌రెడ్డి, మంత్రి
ఇదీ చూడండి: