TRS Protests Schedule: ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరికి నిరసగా.. తెరాస తరఫున ఉద్యమ కార్యాచరణను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఐదంచెల ఉద్యమ కార్యాచరణలో భాగంగా.. ఈ నెల 4 నుంచి 11 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు. కేంద్రం వైఖరిని ఎండగట్టాల్సిన బాధ్యత రైతులు, ప్రజలపైన ఉందన్న మంత్రి.. తెరాస ఆధ్వర్యంలో చేపడుతున్న అన్ని నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రైతులను అవమానించిన కేంద్ర ప్రభుత్వానికి, ఆగం చేసిన రాష్ట్ర భాజపా నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు.
తెరాస ఉద్యమ కార్యాచరణ..
- ఏప్రిల్ 4న అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు
- ఏప్రిల్ 6న నాగ్‌పూర్, బెంగళూరు, ముంబయి, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకోలు
- ఏప్రిల్ 7న హైదరాబాద్ మినహా 32 జిల్లా కేంద్రాల్లో నిరసనలు
- ఏప్రిల్ 7న జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నేతృత్వంలో నిరసనలు
- ఏప్రిల్ 8న అన్ని గ్రామ పంచాయతీల్లో రైతుల ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేసి నిరసనలు
- ఏప్రిల్ 11న దిల్లీలో నిరసనలు.. ఈ నిరసనలో పాల్గొననున్న మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గనేతలు, రైతు సంఘ నేతలు..
రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి..
"నూకలు తినాలని రాష్ట్ర రైతులు, ప్రజలను భాజపా అవమానించింది. రైతుల పక్షాన వెళ్లిన మంత్రులను అవమానించారు. కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస దయ లేదు. యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు విజ్ఞప్తి చేశాం. కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేయదని రైతులకు మేము చెప్పాం. యాసంగిలో ధాన్యం పండిస్తే కేంద్రమే కొంటుందని బండి సంజయ్ అన్నారు. రైతులను వడ్లు వేసేలా భాజపా నేతలు రెచ్చగొట్టారు. ఇప్పుడు కేంద్రం చేతులెత్తేసింది. ఇప్పుడు రైతులు పండించిన ధాన్యానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు. అందుకే.. కేంద్రం, భాజపా నేతల తీరుకు నిరసనగా తెరాస తరఫున ఈ నెల 4 నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నాం. ఈ నిరసన దీక్షల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ధాన్యం కొనుగోలు ఉద్యమంలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొనాలి. కేంద్రం వైఖరిని ఎండగట్టాల్సిన బాధ్యత రైతులు, ప్రజలపైన ఉంది. ఈ నిరసనలకు సమాంతరంగా.. లోక్‌సభ, రాజ్యసభలోనూ కేంద్రం వైఖరిని ఎండగడతాం. ధాన్యం కొనాలని అన్ని గ్రామాలు, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, పీఏసీఎస్‌ల నుంచి ప్రధానికి, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌కు తీర్మానాలు పంపించాం. ఇప్పటికీ వాటిపై ఎలాంటి స్పందన లేదు." - కేటీఆర్, మంత్రి
ఇదీ చూడండి: