Privilege notice on Piyush Goyal: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై తెరాస ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. పీయూష్‌పై రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన ఎంపీలు.. ధాన్యం ఎగుమతుల అంశంపై కేంద్రమంత్రి సభను తప్పుదోవ పట్టించారని నోటీసులో ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 1న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానంలో ఉప్పుడు బియ్యం ఎగుమతులపై సభను తప్పుదోవ పట్టించారని ప్రస్తావించారు.
డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం భారత్ నుంచి ఉప్పుడు బియ్యానికి సంబంధించి ఎలాంటి ఎగుమతులు చేయడం లేదని తెలిపారని తెరాస ఎంపీలు.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులో పేర్కొన్నారు. కేంద్రం లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఎగుమతి చేసినట్లు ప్రభుత్వ వెబ్‌సైట్లో ఉందన్నారు. అందుకు సంబంధించిన వివరాలను జతపరుస్తూ పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. సభను తప్పుదోవ పట్టించిన కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: KTR On Protests: 'మోదీకి సెగ తగిలేలా.. తెలంగాణ తడాఖా చూపించాలి'