దిల్లీలోనూ తెలంగాణ భవన్ నిర్మించబోతున్నామని తెరాస లోక్సభ పక్షనేత నామ నాగేశ్వర రావు తెలిపారు. తెలంగాణ భవన్ నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం 1.48గం.లకు తెరాస పార్టీ భవన నిర్మాణానికి భూమి పూజ జరుగనుందని చెప్పారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతుందని తెలిపారు.
ఇది ఒక చరిత్ర. మన నాయకుడు 20 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చారు. దిల్లీలో తెలంగాణ భవన్కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. భారత దేశంలో ఏ రాష్ట్రం లేని అభివృద్ధి తెలంగాణలో జరిగింది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. రైతు బంధు, దళిత బంధు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం.
-నామ నాగేశ్వర రావు, తెరాస లోక్సభ పక్షనేత
దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం చరిత్రాత్మక విషయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ మహత్తర ఘట్టంలో తనకు భాగస్వామ్యం కల్పించడం గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన పోరాటం నుంచి రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేస్తున్న అభివృద్ధి పనుల కొరకు దేశమంతటా చాటి చెప్పడానికి ఢిల్లీలో కార్యాలయం ఉపయోగపడుతుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, దళిత బంధు వంటి అనేక పథకాలు, కార్యక్రమాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి.
- వేముల ప్రశాంత్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్న తెరాస కార్యనిర్వాహక అధ‌్యక్షుడు కేటీఆర్.. తెరాస కార్యాలయం నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు. కేటీఆర్ వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కవిత ఉన్నారు.
ఇదీ చదవండి: India Taliban Talks: 'కశ్మీర్ కోసం తాలిబన్లతో భారత్ డీల్!'