Twitter Trending: రాష్ట్ర ఆర్థిక వృద్ధి రికార్డు స్థాయిలో నమోదైన సందర్భంగా తెరాస శ్రేణుల ట్వీట్లు మరోసారి జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే వ్యూహంలో భాగంగా.. తెరాస ఇటీవల ట్విటర్లో పలు అంశాలను ట్రెండింగ్ చేస్తోంది. రాష్ట్ర జీఎస్డీపీ, తలసరి ఆదాయం పెరుగుదలపై ఈనాడులో ప్రచురితమైన వార్తను నిన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
సుమారు 50 వేల ట్వీట్లు..
తెలంగాణ విజయం సాధించేందుకు గణాంకాలే నిదర్శనమంటూ ఆయన చేసిన ట్వీట్‌కు అనుబంధంగా ట్రయంప్ తెలంగాణ(#TriumphantTelangana..), థాంక్యూ కేసీఆర్ (#ThankYouKCR) హ్యాష్‌ట్యాగ్‌లతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, తెరాస నేతలు ట్విట్టర్లో పోస్టులతో నింపేశారు. సుమారు 50 వేల ట్వీట్లతో జాతీయ స్థాయిలో ఈ ట్యాగ్లు ట్రెండింగ్‌లో నిలిచాయి.
ట్విట్టర్ వేదికగా ప్రశంసలు..
అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించి నేడు దేశానికే దిక్సూచిగా నిలిచిందని తెరాస నేతలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నిపుణులు స్పందించారు. ఉద్యమ నాయకుడే పాలకుడైతే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో చెప్పడానికి తెలంగాణే ఒక పెద్ద ఉదాహరణ అంటూ ట్విట్టర్ వేదికగా కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ.. ఎనిమిదేళ్లలో తానేమిటో యావత్ దేశానికి చూపించిందని ట్వీట్లు చేశారు. కేసీఆర్ దార్శనిక పాలనకు తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు ఒక నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. మోదీ సర్కారు నుంచి సహాయ నిరాకరణ ఎదురైనా.. రాష్ట్రం సొంతంగా ఎదుగుతోందంటూ.. కేంద్ర సర్కారు తీరు, వివక్షను పలువురు కార్యకర్తలు ట్వీట్లతో ఎండగట్టారు.
ఇదీ చూడండి: