కొద్ది రోజుల్లో పెళ్లి కావాల్సిన యువజంట అనంతలోకాలకు వెళ్లిపోయింది. హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్‌లో విచారకర ఘటన చోటుచేసుకుంది. రైలుపట్టాలు దాటుతుండగా మనోహర్, సోనీ అనే ఇద్దరు.. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని దుర్మరణం చెందారు. మృతులు సమీపంలోని పాపిరెడ్డికాలనీకి చెందిన వారని... ఇటీవలే వీరికి నిశ్చితార్థం జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే వీరు రైలు ఢీకొని చనిపోయారా లేక ఆత్మహత్య చేసుకున్నారా.. అనే సందేహాలు కలుగుతున్నాయని అక్కడికి చేరుకున్న స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ స్టేషన్‌లో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నా... పోలీసులు, రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పాదాచారుల కోసం అండర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ అందులో ఎప్పుడూ మురుగునీరు చేరుతుండటం వల్ల ఎవరూ ఆ దారి గుండా పోవడం లేదని స్థానికులు తెలిపారు.