ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ సమస్యతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నందున ప్రతి ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్ సాగర్ అందాలు కనువిందు చేస్తుండగా.. మరోవైపు విగ్రహాలతో పాటు... చిన్నపాటి ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. అయితే ఈమార్గంలో వాహనాల రాకపోకల వల్ల సందర్శకులు రోడ్డు దాటడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా కేటీఆర్... హైదరాబాద్ పోలీసులకు కోరారు.
మంత్రి కేటీఆర్ సూచనలపై స్పందించిన సీపీ అంజనీ కుమార్... ప్రతి ఆదివారం వాహనాలను వేరే మార్గంలో మళ్లించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రచించారు. ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా దారి మళ్లిస్తారు. లోయర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మీదుగా వాహనదారులు రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది. సందర్శకుల వాహనాలు మాత్రమే ట్యాంక్ బండ్ మీద 200 మీటర్ల లోనికి అనుమతిస్తారు. ఆ తర్వాత బారికేడ్లు వేసి... కేవలం కాలినడక ద్వారానే ట్యాంక్ బండ్‌పై తిరగాల్సి ఉంటుంది.
కొత్త రెయిలింగ్, బస్‌షెల్టర్స్, ఇతర సౌకర్యాలతో ట్యాంక్‌బండ్ ఎంతలా అభివృద్ధి చెందుతుందో మీరంతా చూశారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ అందమైన ప్రాంతంగా మారింది. కానీ ఈ అందాలను ఆస్వాదించడానికి ఈ మార్గంలో ట్రాఫిక్ ఆటంకం కలిగిస్తోంది. అందువల్ల ఇకనుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్ రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తాం. కేవలం పర్యాటకుల వాహనాలను మాత్రమే అనుమతిస్తాం. అవికూడా 200 మీటర్ల వరకే పరిమితం. ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అందరూ కాలినడకన వెళ్లాల్సిందే. ఆసమయంలో ఇతర వాహనాలు లోయర్‌ట్యాంక్‌బండ్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో ప్రతిఒక్కరూ సహకరించాలి. -అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ.
ఇదీ చూడండి: stephen ravindra: సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతల స్వీకరణ