Revanth Reddy About Warangal Declaration : రాహుల్ గాంధీ పాల్గొన్న రైతు సంఘర్షణ సభలో తీసుకున్న వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాజీవ్‌గాంధీ వర్దంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజులపాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ముఖ్యనాయకుడు 21వ తేదీన ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాలో జయశంకర్ సొంత గ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 30 రోజులపాటు అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమాలు జరుగుతాయని రేవంత్ తెలిపారు. జూన్ 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజకవర్గాల్లో 15 మంది ముఖ్యనాయకులను నియమించి రచ్చబండ సభలు విజయవంతం అయ్యేలా చూడాలని నేతలకు సూచించారు. జనజాగరణ్ అభియాన్ యాత్ర కార్యక్రమాలు...పెరిగిన ధరలపై కూడా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
- ఇదీ చదవండి : 'ఆ మెసేజ్‌లు సేవ్ చేసి.. మీ లైఫ్‌ను సేవ్ చేస్కోండి'
రాహుల్ గాంధీని తెలంగాణలో 100 కిలో మీటర్లు పాదయాత్ర చేయాలని కోరేందుకు తీర్మానం చేసినట్లు చెప్పారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్ శిబిరంలో తీసుకున్న అన్ని అంశాలను ఈ సమావేశంలో ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ సోనియా గాంధీకి పంపాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు.
"వరంగల్ డిక్లరేషన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. చింతన్ శిబిర్‌లో వరంగల్ డిక్లరేషన్ గురించి చర్చించారు. ఉదయ్‌పుర్ అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించాం. వరంగల్ డిక్లరేషన్‌ను జనంలోకి బలంగా తీసుకెళ్తాం. రాష్ట్రంలో రాహుల్‌గాంధీ 100 కి.మీ. పాదయాత్ర చేయాలని కోరతాం." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇదీ చదవండి : చైన్ స్నాచర్లకు బుద్ధి చెప్పిన కాజల్.. గన్‌తో కూతుర్ని బెదిరించగానే..