ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. వారం రోజులుగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున చెల్లించాలని కోరారు. విత్తనాలు, ఎరువులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకం అమలు చేయాలని... తక్షణమే రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని రేవంత్ విమర్శించారు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందన్న దురుద్దేశంతోనే వెనకడుగు వేసిందని మండిపడ్డారు. జాతీయ వ్యవసాయ బీమా సంస్థ రాష్ట్రంలో ‘వర్ష బీమా - 2021’ పేరుతో అమలు చేస్తున్న పథకం కేవలం ఏడు పంటలకు మాత్రమే పరిమితమైందన్నారు.
ఆ పంటలకు కూడా బీమా ప్రీమియం పూర్తిగా రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఓవైపు వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోయాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డీజిల్ పై వేస్తోన్న పన్నుల భారం పరోక్షంగా వ్యవసాయ పెట్టుబడులపై ప్రభావం చూపుతోందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కూలీ రేట్లు పెరగడంతో ఉత్పాదక ఖర్చులు 20 శాతానికి పైగా అదనంగా పెరిగాయని తెలిపారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన రూ. లక్ష రుణమాఫీ హామీని తక్షణమే నెరవేర్చాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: CM KCR: 'ఆర్థికంగా పటిష్ఠమైన రోజే ఎస్సీలు వివక్ష నుంచి దూరం అవుతారు'