ఏడేళ్లుగా పేద ప్రజలను పట్టి పీడిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచకాలకు స్వస్తి చెప్పాలని ఏఐసీసీ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టినట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ కార్యక్రమంలో భాగంగా... ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌కు భారీఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయినా... ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
వాళ్లనే దొంగలంటే.. మరి వీళ్లనేమనాలి...?
"పెట్రో పన్నులతో కేసీఆర్, మోదీ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. కేవలం 4ం రూపాయలకే వస్తున్న పెట్రోల్‌ను మోదీ, కేసీఆర్ కలిసి రూ.105కు అమ్ముతూ.. సామాన్యుని జేబులకు చిల్లులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 32 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 33 రూపాయలను దోచుకుంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడా ఇంత శాతం పన్నులేదు. దోపిడీ లేదు. జేబులు కొట్టే చిన్న చిన్న దొంగల ఫొటోలు పోలీస్స్టేషన్లలో పెట్టినప్పుడు... మరి పేదోళ్ల జేబులు గుల్లు చేస్తూ వాళ్ల చెమట, రక్తాన్ని దోచుకుంటున్న మోదీ, కేసీఆర్ ఫొటోలను ఎక్కడ పెట్టాలి...? వాళ్లనే జేబు దొంగలన్నప్పుడు మరి వీళ్లనేమనాలి..?"
- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఒక్కొక్కరి నెత్తి మీద ఆరు లక్షల అప్పు...
చాలా దేశాల్లో పెట్రోల్ ధర దాదాపు రూ.40 మాత్రమే ఉందని రేవంత్ వివరించారు. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోనూ పెట్రోల్ రూ.53 మాత్రమే ఉందని పేర్కొన్నారు. పెట్రో పన్నులపై మార్కెట్లో, గుళ్లో, బళ్లో... ఎక్కడైనా జనాలు చర్చించాలని సూచించారు. పెట్రోల్ ధర రూ.105లో రూ.65.... డీజిల్ ధర రూ.99లో రూ.57 మోదీ, కేసీఆర్ కలిసి దోచుకుంటున్నారని వివరించారు. 33 శాతం వస్తువు విలువుంటే పన్ను రూపంలో 67 శాతం వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు ఇంతగా దోచుకోటానికి పరోక్షంగా దేశ, రాష్ట్ర ప్రజలు కూడా కారణమేనని రేవంత్ వ్యాఖ్యానించారు. రెండు చోట్లా.. రెండు సార్లు ఎన్నుకున్నందుకే జనాలను నిలువునా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లడబ్బు తీసుకొచ్చి ప్రతీ పౌరుని ఖాతాలో వేస్తానన్న మోదీ.. ఒక్క రూపాయి ఇవ్వకపోగా... ఒక్కొక్కరి నెత్తి మీద ఐదు లక్షల అప్పు, కేసీఆర్.. లక్ష రూపాయల అప్పు పెట్టారని స్పష్టం చేశారు.
చట్టపరిధిలో శిక్షించటం ఖాయం...
"హ్యాకర్లతో కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ఇంటలీజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు అన్యాయంగా ట్యాప్ చేసి అరెస్టులు చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. కేసీఆర్ ఇంకా రెండేళ్లు మాత్రమే ఉంటారు. తర్వాత వచ్చేది సోనియమ్మ రాజ్యం. కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యం. పోలీసు శాఖలో ఓ ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించి కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న నిన్ను... చట్ట పరిధిలో శిక్షించటం ఖాయం."
- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
మాకు వీళ్లపై నమ్మకం పోయింది...
పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ప్రజల తరఫున వినతిపత్రం ఇస్తామనటంతోనే.. గవర్నర్ తమిళిసై పుదుచ్చేరికి వెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆన్లైన్లో వినతిపత్రం సమర్పించాలని అధికారులు చెబుతున్నారని తెలిపారు. తమకు మోదీ, గవర్నర్, సీఎం మీద నమ్మకాలు పోయాయని... తాము నమ్మేది రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహేబ్ అంబేడ్కర్నేనని పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి.. తమ బాధ తెలియజేసేందుకు శాంతియుతంగా వెళ్తామన్న రేవంత్... తమకు పోలీసులు సహకరించాలని కోరారు. తామూ... తమ కార్యకర్తలు ర్యాలీగా... క్షమశిక్షణతో వెళ్తామని... కావాలంటే పోలీసులు కూడా నిరసనలో పాల్గొనొచ్చన్నారు. పోలీసులకు కూడా జీతాలు పెంచుతామని, వారాంతపు సెలవులు ఇస్తానని ఇప్పటి వరకు ఏమీ చేయలేదని.. దానికి నిరసనగా ర్యాలీలో భాగస్వామ్యం కావాలని రేవంత్ సూచించారు.
ఇదీ చూడండి: Revanth Reddy: 'ఎంతమందిని అరెస్టు చేసినా ర్యాలీ చేసి తీరతాం'