ETV Bharat / city

Tourist places : రా.. రమ్మని.. పర్యాటక ప్రాంతాలు పిలిచెను ఈ వేళ

అలరించే జలపాతాలూ... ఆసక్తిని రేకెత్తించే కోటలూ... ఆహ్లాదాన్నిచ్చే సాగరతీరం... ఆకట్టుకునే అభయారణ్యాలు... ఎక్కగలవా అంటూ సవాలు చేసే కొండలు... ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కరోనా ధాటికి విహారయాత్రలకు మొహం వాచిపోయినవారికి - ఆ లోటు తీరుస్తాం రారమ్మని పిలుస్తున్నాయి..!

tourist-places-and-its-specialty-in-telugu-states
కొండా కోనా చూసొద్దామా
author img

By

Published : Jul 11, 2021, 8:41 AM IST

ప్పుడప్పుడు నాలుగు రోజులు ఎటైనా వెళ్లిరావడం అనేది- అలసిన మనసుకి అవసరమైన సాంత్వన. గత ఏడాదిన్నరగా పరిస్థితులు ఆ అవసరానికి కళ్లెం వేశాయి. పిల్లల్నీ పెద్దల్నీ కూడా ఇళ్లలో బందీలను చేశాయి. అయితే ఎంతకాలమని అలా తలుపులు వేసుకుని ఉండగలం. అందుకే వాన తగ్గగానే పక్షులు రెక్కలల్లార్చుకుంటూ ఎగిరినట్టు... కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇక మనుషులూ తగు జాగ్రత్తలతో ప్రయాణాలు మొదలెడుతున్నారు.

ఇలాంటి సమయంలో మరీ దూరప్రాంతాలకు కాకుండా దగ్గరలోనే చిన్న చిన్న విహారయాత్రలు చేస్తే- బడి ముఖం కూడా చూడకుండా ఇళ్లల్లో ఉండిపోయిన పిల్లలు కాస్త స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఇల్లూ ఆఫీసుల మధ్య పనుల ఒత్తిడితో నలిగిన పెద్దలూ ప్రకృతి ఒడిలో కాసేపు సేదదీరవచ్చు. అందుకే మరీ కొత్త ప్రదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా కాస్త పరిచయం ఉన్న తెలుగు రాష్ట్రాల్లోనే ఆ టూర్‌లేవో వేసుకుంటే- సూక్ష్మంలో మోక్షంలాగా విహారయాత్ర కోరికా నెరవేరుతుంది. పిల్లలకు కొత్త ప్రాంతాన్ని చూపించినట్లూ అవుతుంది. పైగా వీటిని సందర్శించడానికి ఎన్నో రోజులు అక్కర్లేదు. వీలును బట్టి ఒక్కరోజులో చూసి రాగలిగినవీ ఉన్నాయి. వారాంతంలో ఓ రెండు రోజులు సరదాగా గడిపి రాదగినవీ ఉన్నాయి. ఎవరికి వారు అందుబాటులో ఉన్న సమయానికీ, అభిరుచికీ తగిన ప్రదేశాన్ని ఎంచుకుని ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవడమే తరువాయి..!

ఆయా ప్రాంతాలేమిటో ఓసారి చూసేద్దామా మరి..!

కళకళలాడుతున్న జలపాతాలు

తొలకరి వర్షాలు బాగానే కురవడంతో జలపాతాలన్నీ జోరుమీదున్నాయి. ఎత్తైన కొండల మీదినుంచి ఎగసిపడేవి కొన్ని... కొద్దిపాటి ఎత్తునుంచి నాజూగ్గా జాలువారేవి మరికొన్ని... ఎలా పడినా నీటి ప్రవాహానిది మైమరపింపజేసే అందం. ఆ అందాలను చూస్తూ స్వచ్ఛమైన ఆ నీటిలోకి దిగి కేరింతలు కొట్టేందుకు తగిన సమయం ఇదే. రెండు రాష్ట్రాల్లోనూ బోలెడన్ని జలపాతాలు నిండుగా ప్రవహిస్తూ కనులవిందు చేస్తున్నాయి. పిల్లలమీద ఓ కన్నేసి ఉంచితే చాలు, చాలావరకూ తక్కువ లోతుతో ప్రమాదరహితమైన ప్రాంతాల్లోనే ఉన్న ఈ జలపాతాలను అందరూ ఆస్వాదించవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ : దట్టంగా ఉండే తిరుమల కొండల్లో దాదాపు 270 అడుగుల ఎత్తునుంచి కొండ చరియలను తాకుతూ పడే తలకోన జలపాతం ఎంతో అందంగా కన్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని జలపాతాల్లో ఎత్తైనది ఇదే. ఈ జిల్లాలోనే కైలాసకోన, దుముకురాళ్ల(కైగల్‌), ఉబ్బలమడుగు(తడ), నాగలాపురం జలపాతాలుండగా రాజమండ్రి దగ్గర అమృతధార, రంపచోడవరం దగ్గరున్న రంప, విశాఖ జిల్లాలో కొత్తపల్లి, బొర్రా గుహల దగ్గరున్న కైతికి, తాటిగూడ, నాగార్జున సాగర్‌ దగ్గర ఎత్తిపోతల, ప్రకాశం జిల్లాలో భైరవకోన తదితర జలపాతాలు ఉన్నాయి.

తెలంగాణ: ఇక్కడి జలపాతాలు ఎత్తు తక్కువగా ఉండి వెడల్పుగా ప్రవహిస్తుంటాయి. 164 అడుగుల ఎత్తునుంచి జాలువారే కుంటాల తెలంగాణలోని ఎత్తైన జలపాతం. ఆ తర్వాత స్థానం తెలంగాణ నయగరా అని పిలిచే ములుగు జిల్లాలోని బొగత జలపాతానిది. నల్లమలలోని మల్లెల తీర్థమైతే పూలజల్లులా పడుతుంటుంది. ఇంకా హైదరాబాద్‌ దగ్గరలో అనంతగిరి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ చుట్టుపక్కల ఉన్న పొచ్చెర, కనకాయ, గాయత్రి జలపాతాలు, అసిఫాబాద్‌లో గుండాల, మహబూబాబాద్‌ జిల్లాలో భీమునిపాదం, ఏడుబావుల, జనగామ దగ్గర మల్లన్నగండి... తదితర జలపాతాలెన్నో పర్యటకులను ఆకర్షిస్తున్నాయి.

ప్రకృతి సోయగం

నగర జీవితం తాలూకు ఉరుకులూ పరుగులూ, రణగొణ ధ్వనులకూ దూరంగా పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోలెడన్ని ప్రాంతాలున్నాయి. ప్రశాంత వాతావరణంతో పాటు పలురకాల పక్షులూ వన్యమృగాలనూ అవి జీవించే సహజ వాతావరణంలో చూసేందుకు వీలుగా ఏర్పాటుచేసిన అభయారణ్యాలూ అడవులను ఇష్టపడేవారికి చక్కటి విహారస్థలాలు.

ఆంధ్రప్రదేశ్‌: ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు మన్యం అటవీ ప్రాంతం. శీతాకాలంలో అరకు లోయవైపు వెళ్లామంటే- విరబూసిన కాఫీ తోటలే కాదు, ఎటుచూసినా ఎత్తైన పచ్చటి కొండలూ ఆ కొండల మధ్య పాలసముద్రాన్ని తలపించేలా తెల్లని దట్టమైన పొగమంచు అందాలూ కనువిందు చేస్తాయి. సముద్ర మట్టానికి మూడువేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న లంబసింగి, చెరువులవెనం, పాడేరు లాంటి ప్రాంతాలు కట్టిపడేసే ప్రకృతి సోయగాలకు నెలవులు. అద్భుతమైన సూర్యోదయ దృశ్యాలతో అలరిస్తూ
సందర్శకకేంద్రంగా మారిన వంజంగి కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. అలాగే గోదావరి జిల్లాల్లో పాపికొండలు, మారేడుమిల్లి అటవీ ప్రాంతం, కోరంగి, కోనసీమ, చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులు, హార్స్‌లీ హిల్స్‌ లాంటివి అటవీ ప్రాంతాలను ఇష్టపడేవారికి ఎంతో సాంత్వననిస్తాయి.

లక్నవరం

తెలంగాణ: వరంగల్‌ జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో కొండల మధ్య మూడు సన్నని లోయలు కలుస్తూ ఏర్పడిన లక్నవరం సరస్సు కాకతీయుల కాలం నాటిది. దానిమీద కొత్తగా కట్టిన అందమైన వంతెన పర్యటకులను అలరిస్తూ లక్నవరం చెరువు మధ్యలో ఉన్న దీవులను పిక్నిక్‌ స్పాట్‌గా మార్చింది. అక్కడ గుడారాల్లో బసచేయవచ్చు. రాత్రిపూట చలిమంటలు వేసుకుని సరదాగా గడపొచ్చు. ఉదయమే పక్షుల కిలకిలారావాలు మేల్కొలుపుతాయి. అడవిలో నడుస్తూ వన్యప్రాణుల్ని చూడవచ్చు. అక్కడికి కాస్త దగ్గరలోనే ఉన్న పాండవుల గుట్టల్లో రాతియుగపు చిత్రాలున్నాయి. తాడ్వాయి హట్స్‌ కూడా వనవిహారుల కోసమే. పిల్లలకు ఆటస్థలంతోపాటు వన్యప్రాణి మ్యూజియం కూడా ఉందిక్కడ.

కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కు

హైదరాబాద్‌ శివారులోనే ఉన్న కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కుని అడవిలాంటి ఉద్యానవనం అనవచ్చు. అటవీశాఖ 75 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన ఈ పార్కులో 50 వేల పైచిలుకు చెట్లున్నాయి. పెద్దలకోసం యోగా హాల్‌, వాక్‌వేలూ ఉన్నాయి. పిల్లలకు ఆటస్థలంతో పాటు ట్రీహౌస్‌, పక్షులూ సీతాకోకచిలుకల పార్కులు ఉన్నాయి. కుటుంబమంతా కలిసి పిక్నిక్‌కి వెళ్లడానికి చక్కని చోటు ఇది. ఇలాంటివే నగరం చుట్టుపక్కల మరికొన్ని ఏర్పాటుచేశారు.

రెండు రాష్ట్రాల మధ్య మరో ముఖ్యమైన అటవీ ప్రాంతం- నల్లమల. ఆ అందాలను సంపూర్ణంగా ఆస్వాదించాలంటే హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న ఫరహాబాద్‌ వ్యూపాయింట్‌ చక్కటి ప్రాంతం. ఇక్కడి నుంచి జింకలు, వేటకుక్కలు లాంటి వన్యమృగాలను చూడొచ్చు. ఆక్టోపస్‌ వ్యూపాయింట్‌ నుంచి నల్లమల కొండల మధ్యలోంచి కృష్ణమ్మ ప్రవాహ దృశ్యాన్ని వీక్షించడం ఓ మరపురాని అనుభూతి. జన్నారం దగ్గరున్న కవాల్‌ అడవుల్లోని పెద్ద పులుల సంరక్షణ కేంద్రం వైపు జీపు సఫారీలో వెళ్తే పెద్ద పులులతోపాటు నీల్గాయ్‌, సాంబార్‌ లాంటి ఎన్నో రకాల జంతువులూ పక్షులూ కన్పిస్తాయి.

ట్రెకింగ్‌ చేస్తారా..?

ట్రెకింగ్‌ చేస్తారా..?

యువత ఈ మధ్య ట్రెకింగ్‌ పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. రాక్‌ క్లైంబింగ్‌, ట్రెకింగ్‌ క్లబ్బులు ఇప్పుడు దాదాపు అన్ని నగరాల్లోనూ ఉన్నాయి. అలవాటుగా కాకపోయినా ఆసక్తితో ఎప్పుడైనా ట్రెకింగ్‌ ప్రయత్నించాలనుకునేవారికీ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలే అనువుగా ఉన్నాయి. చాలావరకు ఇవి జలపాతాల పరిసరాల్లోనే ఉండటంతో ఒకేసారి రెండిటికీ ప్లాన్‌ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌: నంద్యాల దగ్గర ఉన్న అహోబిలం, చిత్తూరులోని తలకోన, తడ, నాగలాపురం అడవులు, శ్రీవేంకటేశ్వర వన్యమృగ సంరక్షణ కేంద్రం, అరకులోయ వద్ద తైద నేచర్‌ క్యాంప్‌, గండికోట లాంటివి సాహస క్రీడలను ఇష్టపడేవారిని ఆకట్టుకుంటున్నాయి.

తెలంగాణ: హైదరాబాద్‌ చుట్టుపక్కల కొండమడుగు, గన్‌రాక్‌ హిల్‌, కీసరగుట్ట, నర్సాపుర్‌ అడవులు, భువనగిరి కోట, చిట్యాల, అనంతగిరి కొండలు, ఇంకాస్త దూరం వెళ్తే దేవరకొండ, కోయిల్‌కొండ, కదళీవనం గుహలు, మల్లెలతీర్థం, పాండవుల గుట్టలు, తాడ్వాయి, చించోలి అటవీ ప్రాంతాలు, అలీసాగర్‌ లాంటివి ట్రెకింగ్‌కి అనువుగా ఉంటాయి.

చార్మినార్

చరిత్ర తెలుసుకుందాం..!

రాజులు ఏలిన కోటలూ, వారి ఘనమైన చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిన నాటి భవనాలూ... ఆ ఆవరణలోకి అడుగిడడం ఆలస్యం- సందర్శకుల్ని ఒక్కసారిగా మరోలోకంలోకి తీసుకెళతాయి. ఒక్క హైదరాబాదులోనే కాదు, చారిత్రక ప్రదేశాలూ స్థల ప్రాధాన్యాన్ని చాటే మరెన్నో ఆనవాళ్లూ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఉన్నాయి. ఆసక్తీ ఓపికా ఉండి చూడాలే కానీ అవి ఆనాటి విశేషాలెన్నో చెబుతాయి. ఈ కోటల్లో పలుచోట్ల ఇప్పుడు లైట్‌ అండ్‌ సౌండ్‌ షోలతో నాటి చరిత్రకథలను ఆసక్తికరంగా విన్పిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌: చుట్టూ అందమైన లోయలు, రాతి ప్రాకారాలతో శత్రు దుర్భేద్యమైన కోట, ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలు గండికోట ఒడిలో ఒదిగి ఉన్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు దగ్గరలో పెన్నానది ఒడ్డున కళ్యాణి చాళుక్య రాజులు నిర్మించిన గండికోట చరిత్రలో జరిగిన ఎన్నో యుద్ధాలకు మౌనసాక్షి. పెన్నా, చిత్రావతి నదులు రెండూ కలిసేచోట కొండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన గండికి సమీపంలోని పర్వతంపై కోటను నిర్మించడం వల్ల దీనికి గండికోట అనే పేరు వచ్చిందట. సముద్రమట్టానికి 1670 అడుగుల ఎత్తున కొండపై కోటను నిర్మించడం, మరోవైపు పెన్నా నది ప్రవహించడం వల్ల ఈ కోట శత్రు దుర్భేద్యమై అలరారింది. పలు రహస్య, సొరంగ మార్గాలతో నిర్మించిన ఈ విశాలమైన కోటలో ఒకప్పుడు వజ్రాలు లభించాయనీ వాటిని విదేశాలకు ఎగుమతి చేసేవారనీ చరిత్ర చెబుతోంది.

కోటలు.. రాజసానికి ప్రతీకలు

చిత్ర, శిల్పకళల కాణాచిగా పేరొందిన లేపాక్షిని చూడాలంటే అనంతపురం జిల్లాకి వెళ్లాలి. ప్రపంచంలోనే పెద్ద ఏకశిలా నంది విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు. విజయవాడ శివారులో ఉన్న గుప్తుల కాలం నాటి ఉండవల్లి గుహలు, కొండపల్లి కోట, గుంటూరు జిల్లాలో ఉన్న నాగార్జున కొండ కూడా చరిత్ర ప్రియులకు ఆసక్తికలిగించే ప్రాంతాలే. బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడి పేర వెలసిన నాగార్జునకొండ ఒక దీవి. చుట్టుపక్కల తవ్వకాలలో బయటపడ్డ పలు బౌద్ధమత అవశేషాలను ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారు.

తెలంగాణ: హైదరాబాదులోని గోల్కొండకోట శిథిలవైభవానికి సాక్షిగా మిగలగా, చౌమొహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌ లాంటివి ఆనాటి సాంస్కృతిక వైభవానికీ, నిర్మాణ సోయగాలకీ, వెల్లివిరిసిన సంపదలకీ అద్దంపడతాయి. చరిత్రను ఇష్టపడేవారు తప్పనిసరిగా చూసితీరాల్సిన వాటిల్లో మరొకటి సాలార్‌జంగ్‌ మ్యూజియం. ఇక, నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న ‘ఖిల్లా’ ఒకప్పటి జైలు. ప్రముఖ కవి దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఆ జైలు గోడల మీదే రాశారట. ఇంకా ఖమ్మం, వరంగల్‌, భువనగిరి, మెదక్‌, గద్వాల, రాచకొండలాంటి ప్రాంతాల్లోనూ చారిత్రక ప్రసిద్ధి గాంచిన కోటలున్నాయి.

పాపికొండల యాత్ర

పడవ విహారం

కనుచూపు మేరా పరుచుకున్న జలావరణంపై పడవ ప్రయాణం అనుభూతే వేరు. కొద్దిచోట్ల మాత్రమే ఉండే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఆ అనుభూతి చిరకాలం గుర్తుండిపోతుంది. అందుకే ఎంత దూరమైనా పడవ ప్రయాణ అనుభవం కోసం ప్రత్యేకంగా వెళ్తుంటారు అభిమానులు.

ఆంధ్రప్రదేశ్‌: గలగలా సాగే గోదావరి పరవళ్లు... మధ్యలో అక్కడక్కడా ఇసుక తిన్నెలు... నదికి ఇరువైపులా ఎత్తైన కొండలు... రెప్పవేస్తే ఏమి మిస్సవుతామో అన్నట్లుగా సాగుతుంది పాపికొండల మధ్య పడవప్రయాణం. అలాగే ప్రశాంతగంభీరంగా సాగే కృష్ణానది మీద పడవలో ప్రయాణిస్తూ భవానీద్వీపానికి వెళ్లడమూ ఓ అందమైన అనుభవమే. ప్రకాశం బ్యారేజీకి సమీపంలో ఉన్న ఈ ద్వీపంలో పిల్లల్ని అలరించే పలు క్రీడాపరికరాలున్నాయి. నదిమీదుగా వీచే చల్లని గాలిలో పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా నడవడం పెద్దలకు స్ట్రెస్‌ బస్టర్‌ అంటే అతిశయోక్తి కాదు. ఇవి కాక పాలకొల్లు దగ్గర దిండి, ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్రసంగమం, విశాఖపట్నంలో రిషికొండ బీచ్‌, నెల్లూరులో పులికాట్‌ సరస్సు, నాగార్జునసాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లు, కాకినాడ దగ్గర హోప్‌ ఐలాండ్‌, విజయనగరంలో తాటిపూడి రిజర్వాయర్‌లాంటి చోట్ల పడవప్రయాణ సౌకర్యాలున్నాయి.

తెలంగాణ: హైదరాబాదులో హుస్సేన్‌సాగర్‌తో పాటు దుర్గం చెరువు, మీరాలం చెరువులాంటి చోట్లా వరంగల్‌లో రామప్ప, లక్నవరం సరస్సుల్లో, నిజాంసాగర్‌, సోమశిల రిజర్వాయర్‌లలో బోటింగ్‌ ఏర్పాటు ఉంది.

జలపాతాలు

బీచ్‌కి వెళతారా..!

ఎంతటివారినైనా వయసు మరిచిపోయి ఆడుకునేలా చేసే అందమైన ప్రాంతం సముద్రతీరం. ఉవ్వెత్తున ఎగసి అంతలోనే వెనక్కి తగ్గే అలలతో పాదాలకిందనుంచి జారిపోయే ఇసుక స్పర్శ... మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది. తడి ఇసుకలో తీరం వెంబడి నడవడాన్నీ దూరంగా నీటిలోకి అస్తమించే సూర్యుడిని చూడడాన్నీ చాలామంది ఇష్టపడతారు.

కాకపోతే ఈ బీచ్‌ అందాల్ని ఆస్వాదించాలంటే సుదీర్ఘ తీరప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లోనే సాధ్యం. విశాఖపట్నం నగరానికి ఆనుకుని ఉన్న రామకృష్ణా బీచ్‌ది ఒకరకం అందమైతే కాస్త దూరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా సకల సౌకర్యాలతో ఏర్పాటుచేసిన రుషికొండ బీచ్‌ది మరో రకం అందం. రుషికొండ బీచ్‌ని సౌరవిద్యుత్తుతో నిర్వహిస్తూ నిర్మాణాలన్నిటికీ వెదురును ఉపయోగించి పర్యావరణహితంగా అభివృద్ధి చేశారు. ఇక, బీచ్‌రోడ్డులో ఉన్న ‘కురుసురా’ జలాంతర్గామి, ‘టీయూ 142’ యుద్ధవిమానాలను పర్యటకులు లోపలికి వెళ్లి చూడవచ్చు. జీవితకాలం ముగిసిన వీటిని ప్రజల సందర్శనార్థమే ఇక్కడ ఉంచారు. వాటిలోని వివిధ భాగాలనూ అవి పనిచేసే తీరునూ గైడ్‌ల సాయంతో వివరంగా తెలుసుకోవచ్చు. ఇంకా భీమిలి, మంగినపూడి, మైపాడు, సూర్యలంక, తుమ్మలపెంట, ఉప్పాడ, చీరాల, వాకలపూడి, యారాడ, బారువ బీచ్‌లతో పాటు నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలైన అంతర్వేది, హంసలదీవి లాంటి చోట్ల ఉన్న విశాలమైన బీచ్‌లు కూడా పర్యటకులను అలరిస్తున్నాయి.

బీచ్ అందాలు

ఆధునిక దేవాలయాలు

ఆధ్యాత్మిక దేవాలయాలు ఊరూరా ఉన్నాయి. వాటిని పక్కనబెడితే మనిషి అభివృద్ధికి తోడ్పడే ఆధునిక దేవాలయాలుగా పేరొందిన జలాశయాలూ ఆనకట్టలూ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ బోలెడు ఉన్నాయి. సాగు, తాగు నీటిని అందిస్తూ ఆకలి తీర్చడమే కాక అద్భుతమైన నిర్మాణాలతో పెద్దల్నీ పిల్లల్నీ కూడా అబ్బురపరుస్తున్నాయి ఈ పెద్ద పెద్ద రిజర్వాయర్లు. ఎప్పుడో 170 ఏళ్లక్రితమే 3.5 కి.మీ పొడవున కట్టిన కాటన్‌ (ధవళేశ్వరం) బ్యారేజీ ఒక అద్భుతమైతే, చుట్టూ ఎతైన కొండలు నడుమ రెండుకొండలను కలుపుతూ నిర్మించిన మానవనిర్మిత మహాసాగరం... నాగార్జునసాగర్‌ మరో అద్భుతం. డెబ్భయ్యేళ్ల చరిత్ర కల్గిన సాగర్‌ సిగలో ఆకట్టుకునే అందాలెన్నో. 590 అడుగుల పైనుంచి జాలువారే కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న నాగార్జునసాగర్‌, నల్లమల అడవుల మధ్య ఉన్న శ్రీశైలం లాంటివి ఏడాది పొడుగునా సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంటున్నాయి.

జలపాతాల హొయలు

సోమశిల, పోలవరం, పులిచింతల, గండికోట, వెలుగోడు... ఇలా దాదాపు ప్రతి జిల్లాలోనో లేదా దగ్గర్లోనో ఏదో ఒక రిజర్వాయర్‌ ఉంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్ధిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ ఇప్పుడు సరికొత్త పర్యాటక కేంద్రమైంది. ఇక్కడ పారాచూట్‌లో విహరించే అవకాశమూ ఉంది.

ఇకపోతే... ఏటా వనమహోత్సవాలు చేసుకునే సమయమిది. మరి వందల ఏళ్ల వృక్షాలను మాత్రం ఎందుకు చూడకూడదు... ప్రపంచంలోనే పెద్దదైన అనంతపురంలోని తిమ్మమ్మ మర్రిమాను, మహబూబ్‌నగర్‌లోని 800 ఏళ్లనాటి పిల్లలమర్రి... ఇంకా బొర్రా, బెలుం లాంటి గుహలూ... అసలు చూడాలనుకోవాలే కానీ తెలుగు రాష్ట్రాల్లో విశేషాలకేం కొదవ!

ఈ ప్రాంతాలన్నిట్లోనూ రెండు రాష్ట్ర ప్రభుత్వాల పర్యటక శాఖలు తగు వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తున్నాయి. వారి వెబ్‌సైట్ల ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకుని పర్యటన ప్లాన్‌ చేసుకోవచ్చు.

మరి ఆలస్యం దేనికి... కొవిడ్‌ జాగ్రత్తల్ని తు.చ.తప్పక పాటిస్తూ నచ్చిన చోటికి క్షేమంగా వెళ్లి లాభంగా వచ్చేయండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.