Tour and travels apps: కుటుంబమంతా కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు టికెట్ల నుంచి అక్కడ చేసుకునే ఏర్పాట్ల వరకూ ఎన్నో చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీరా వెళ్లాక ఏదో ఒక ఇబ్బంది ఎదురైతే అసంతృప్తి, అసహనం తప్పదు. వాటన్నింటికీ ఈ ఆప్‌లు పరిష్కారం చూపిస్తున్నాయి. టికెట్ల ఏర్పాట్ల నుంచీ ఆ ప్రాంతంలో బడ్జెట్‌కి తగిన హోటళ్లూ, దొరికే ఆహారం, ఆ సమయంలో ఉండే వాతావరణ పరిస్థితుల వరకూ... ఇదీ అదీ అని కాకుండా అన్నిరకాల సదుపాయాల్నీ ఒక్క క్లిక్‌తోనే అందిస్తాయివి.
ఇన్‌క్రెడిబుల్ ఇండియా.. మన భారత ప్రభుత్వం కొంతకాలం క్రితం.. ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ పేరుతో పర్యటకుల కోసం ఓ ఆప్‌ను తెచ్చింది. మన దేశంలో రాష్ట్రాలవారీగా చూడదగిన ప్రదేశాలూ, ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే రెస్టారెంట్లూ, హోటళ్లూ ఇలా ప్రతి సమాచారాన్నీ తెలియజేస్తుందీ ఆప్.
ఫ్యాబ్‌హోటల్స్ ఆప్.. మన బడ్జెట్‌కు తగిన హోటళ్ల వివరాలను చెబుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు ఆరువందల యాభైకి పైగా ఉన్న హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందించే ఈ ఆప్ ద్వారా ఏయే హోటళ్లు ఎంత సదుపాయంగా ఉంటాయి. వైఫై ఉంటుందా లేదా అక్కడ దొరికే ఆహారం ఏమిటి? అదనపు సౌకర్యాలు ఏమిటి? ఇలా అన్నింటినీ ఇట్టే తెలుసుకోవచ్చు. ఇక రైలు/విమానం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎక్కడ ఎక్కాలో తెలియజేస్తోంది.
‘ట్రిపిట్’ ఆప్.. దాంతో ఓ వైపు లగేజీ, మరోవైపు పిల్లల్ని తీసుకుని చివరి నిమిషంలో హడావుడిగా పరుగెత్తే కంగారు లేకుండా చేస్తుంది ‘ట్రిపిట్’ ఆప్. మనం టికెట్లు బుక్‌చేసుకున్నాక ఆ వివరాలను ఈ ఆప్‌లో నమోదు చేస్తే ఆ రోజున అందుబాటులో ఉండే క్యాబ్‌లూ, విమానం/రైలు సమాచారం ఇలా అన్నింటినీ ఎప్పటికప్పుడు అలారంలా తెలియజేస్తుంది. ఏ ప్లాట్‌ఫాంలో రైలు ఆగుతుంది/ లేదా విమానం ఎక్కేందుకు ఏ గేట్‌ద్వారా వెళ్లాలి.. లాంటి సమాచారాన్నీ చివరి నిమిషంలో చెబుతుంది. అవి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నా చెప్పే ఈ ఆప్ తరచూ ప్రయాణించేవారికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఏ కంగారూ లేకుండా...
ఓ కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు ఎక్కడ ఏం దొరుకుతాయీ... అసలు వాతావరణం ఎలా ఉంటుందీ, మంచి ఆహారం తినాలంటే ఏ రెస్టారెంట్ బాగుంటుందీ... షాపింగ్ చేసే మార్కెట్లూ.. వంటివన్నీ తెలుసుకోవడం అంత సులువు కాదు. పోనీ ఎవర్నయినా అడగాలనుకున్నా భాష తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా వాళ్లు సరైన సమాచారం ఇస్తారనీ చెప్పలేము.
ట్రిపిగేటర్, ట్రిపోసో ఆప్.. ఆ సమస్యలేవీ లేకుండా, ఎవరి సాయమూ తీసుకోకుండా కావాలనుకున్న ప్రాంతానికి సులువుగా వెళ్లేందుకు సాయపడతాయి ‘ట్రిపిగేటర్’, ‘ట్రిపోసో’ ఆప్‌లు. ‘ట్రిపిగేటర్’ ద్వారా ఓ ప్రాంతంలో అడుగడుగునా ఏమేం ఉంటాయో పక్కాగా తెలుసుకోవచ్చు. అదే ‘ట్రిపోసో’ అయితే... వ్యక్తిగత మార్గదర్శిగా పనిచేస్తూ పర్యటకుల సందేహాలన్నీ తీరుస్తుంది. ఒకవేళ ప్రయాణించే ప్రాంతంలో వానలు పడుతున్నా, మంచు కురుస్తున్నా, మరీ ఎండగా ఉన్నా కూడా చెప్పేస్తుంది.
వీటన్నింటికీ కాస్త భిన్నం... ‘ట్రిపోటో’. పర్యటకులు ఓ బృందంగా ఉండే ఆప్‌లో ఎవరైనా సరే... తాము చేసిన ప్రయాణాలకు సంబంధించిన ఫొటోలూ, ఆ ప్రాంతానికి చెందిన వివరాలను పోస్ట్ చేస్తే దానికి బదులుగా పాయింట్లు వస్తాయి. అలా వచ్చిన పాయింట్లను ఆ తరువాత ఏదయినా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు బస చేసేందుకూ, రెస్టరంట్లలో రాయితీ పొందేందుకూ ఉపయోగించుకోవచ్చు. వీటిల్లో దాదాపు అన్నీ ఉచితంగానే పనిచేస్తుంటే.. కొన్నింటికి మాత్రం నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి... ఈ సారి మీరు చేయబోయే విహారయాత్ర ఓ మధురజ్ఞాపకంగా మారాలనుకుంటే... ఇలాంటి ఆప్‌లను సద్వినియోగం చేసుకోండి మరి.
ఇవీ చదవండి: