దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రభుత్వం తరపున సీఎం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విజయవాడలోని కనకదుర్గ ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొవిడ్ నిబంధనల రీత్యా ఇప్పటికే రోజుకు 10 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనాలకు ప్రభుత్వం అనుమతిస్తోంది. మూలా నక్షత్రం కావటంతో తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించారు. భక్తుల సంఖ్యను కూడా ఇదేస్థాయిలో పెంచాలని భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రాక సందర్భంగా భక్తుల రాకను కొద్దిసేపు నియంత్రించనున్నారు.