తెలంగాణ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెజస అధ్యక్షుడు కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మార్కెట్ స్తంభించిపోయిందన్నారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విరుస్తోందని విమర్శించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారన్న ఆయన... ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్‌తోపాటు రూ.7,500 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వీలైతే రేపు విద్యాశాఖ కార్యదర్శిని కలుస్తామని వెల్లడించారు.
ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందని కోదండరాం ఆరోపించారు. కళాశాలల మాదిరిగా పాఠశాల విద్యార్థులకు కూడా ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ తరగతులు పరిష్కారం కాదని... అందరికీ విద్య అందించేందుకు నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నారు. వెంటనే విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరారు. పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్నారు... గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో చిన్న, సూక్ష్మ పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని మండి పడ్డారు.
ఇదీ చూడండి: గ్రేటర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.600 కోట్లు విడుదల