తెలంగాణకు కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పొరుగు రాష్ట్రాల్లో కొత్తగా కేసులు నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత వారం రోజుల కేసుల నమోదు సరళిని పరిశీలిస్తే.. 14 జిల్లాల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. ఈనెల 3న 152 కరోనా కేసులు కొత్తగా నమోదవగా.. 5న 170.. 9న 189 కేసులు.. తాజాగా 10వ తేదీన 194 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. ప్రధానంగా జీహెచ్‌ఎంసీలో ఈనెల 4న 27 కొత్త కేసులు నమోదవగా.. తాజాగా 10న 35 నిర్ధారణ అయ్యాయి. అలాగే కరీంనగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మరో 3 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 194 కొవిడ్ కేసులు నమోదవగా, మొత్తం బాధితుల సంఖ్య 3,00,536కు పెరిగింది. మహమ్మారితో మరో 3 మరణాలు సంభవించగా, ఇప్పటివరకు 1,649 మంది కరోనా కారణంగా కన్నుమూశారు. గత రెణ్నెల్లుగా రోజుకు సగటున 1-2 కొవిడ్ మరణాలు రాష్ట్రంలో నమోదవుతుండగా.. తాజాగా ఒకరోజులో మరణాల సంఖ్య మూడుకు పెరగడం గమనార్హం. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 35 కొత్త కొవిడ్ కేసులు నమోదవగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 14, రంగారెడ్డిలో 16 చొప్పున కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
కాలానుగుణ వ్యాధులూ పొంచి ఉన్నాయ్
మరోవైపు ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతుండటంతో కాలానుగుణ వ్యాధులు కూడా విజృంభించే ప్రమాదం పొంచి ఉండడంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, విరేచనాలు తదితర లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన వారికి అవసరమైన పరీక్షలు చేసి, చికిత్స అందించడానికి సన్నద్ధమవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించింది. లక్షణాలున్న వారందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ప్రజలు కూడా సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్ పరీక్షలను ఉచితంగా పొందాలనీ, మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, గుంపుల్లోకి వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
- ఇదీ చూడండి : ''మహా'లో ఆందోళనకరంగా కరోనా విజృంభణ'