హైదరాబాద్ నగరంలో వినూత్న ఉద్యానవనాలను తీసుకరావాలని బల్దియా నిర్ణయించింది. నగరంలో ఆక్రమణకు గురైన, నిర్వహణకు నోచుకోని పార్క్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. వీటితోపాటు రూ. 123 కోట్లతో 50 థీమ్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతోంది. ప్రతి థీమ్ పార్క్‌కు ఒక ప్రత్యేకత ఉండనుంది. దిల్లీ, ఇండోర్, బెంగళూర్ లాంటి ముఖ్య నగరాల్లో ఉన్నవాటిని పరిశీలించి... ఇక్కడ రూపకల్పన చేశారు. శేరిలింగంపల్లి జోన్లో 13 థీమ్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి బస్తీ పిల్లలకు విద్య నేర్పే నాలెడ్జ్ పార్క్.. ఆకర్షణీయ ఆకృతులు, రంగులతో మెప్పించే కలర్స్ పార్క్.. ఇలా పలు థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఆరు పార్కులకు ఇటీవల శంకుస్థాపనలు కూడా చేశారు. ఒక్కో పార్క్‌కు రూ. 2 కోట్లు కేటాయించారు. అదనంగా పూల మొక్కలు, పచ్చదనం అభివృద్ధికి రూ. కోటి నుంచి రూ.1.5 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు.
నాలెడ్జ్ పార్క్..
కాప్రా సర్కిల్‌లోని బండబావిలో జీహెచ్‌ఎంసీ నాలెడ్జ్ పార్క్ నిర్మిస్తోంది. ఈ ప్రాంతంలో బస్తీలు ఎక్కువ. అక్కడి పేద, మధ్య తరగతి పిల్లలకు విజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో మేయర్ రామ్మోహన్ స్థానికంగా నాలెడ్జ్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏరో డైనమిక్స్, శాటిలైట్ టెక్నాలజీ, వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సోలార్ ఎనర్జీ తదితర అంశాలు ఈ ఉద్యానానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఉద్యానంలోని నీటిని వాడుకుని మత్స్య సంపదను వృద్ధి చేయడం, నీటి శుద్ధి, పవన, సౌర విద్యుదుత్పత్తి ఇతర సాంకేతిక అంశాలు కనిపించే ప్రయోగశాలల్లా విద్యార్థులకు విజ్ఞానం అందిస్తాయి. కాలిబాట, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్, జాగింగ్ బాటలు ఉంటాయి. 50 రకాల ఔషధ మొక్కలను పెంచుతామని, సైన్స్ ప్రయోగశాలను నిర్మించే ఆలోచన ఉందని, విద్యార్థులకు ఉచిత తరగతులు చెప్పొచ్చని నిర్వహకులు తెలిపారు.
అందరికీ అందుబాటులో ఉండేలా..
నగరంలో అన్ని పార్క్‌ల్లో... చెట్లను తొలగించకుండా అభివృద్ధి పనులు చేస్తున్నారు. సహజసిద్ధ భౌగోళిక వాతావరణాన్ని అలాగే కొనసాగించి కొత్త అందాలు, సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు డిజైన్లు చేస్తున్నారు. మల్లాపూర్ డంపింగ్‌యార్డును కూడా ఉద్యానంగా తీర్చిదిద్దుతున్నారు. సువాసన, రంగులతో కూడిన పార్క్‌ను తీర్చిదిద్ది వన్యప్రాణులకు ఆవాసం కల్పించనున్నారు. బండబావిలో నాలెడ్జ్ పార్క్ 4.83 ఎకరాలు, బీఎన్‌రెడ్డి కాలనీలో టోపియరీ గార్డెన్ 3.5 ఎకరాలు, ఏఎస్‌రావునగర్‌లో జపనీస్ గార్డెన్ 1.8 ఎకరాలు, మల్లాపూర్‌లో కలర్స్ పార్క్ 2.2 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అన్ని వర్గాలు, వయస్సుల వారికి ఉపయోగపడే విధంగా ఈ థీమ్ పార్కులు ఉండనున్నాయి.
50 రకాల పార్క్‌లు
వీటితో పాటు పూల అలంకరణ పార్క్ ర్కు, రంగుల పార్క్, జపనీస్ థీమ్ పార్క్, వైద్య శాస్త్ర గార్డెన్, పిల్లల పార్క్, మహిళలకు ప్రత్యేక పార్క్, వెదురు బొంగులతో ఏర్పాటు చేసే పార్క్ ఇలా వినూత్నంగా ఏర్పాటు చేస్తున్నారు. బహు తరాల పార్క్, మొగల్ గార్డెన్, ఛాయా పార్క్, ఇంట్రాక్టివ్ పార్క్, భ్రాంతిని కలుగజేసే పార్క్, కమ్యూనిటీ పార్కు, సైన్స్ థీమ్ పార్కు, సువాసనలు వెదజల్లె పార్కు, బండరాతి పార్కు, పర్యావరణ పార్కు, బతుకమ్మ పార్క్, క్రీడల పార్క్, పూల మొక్కల పార్క్, వ్యాయమశాల పార్క్, ఎల్ఈడీ పార్క్, సెవెన్ వండర్స్ పార్క్ లాంటి 50 పార్క్‌లు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని నగరంలో ప్రారంభించారు. రానున్న మూడు నెలల్లో పనులు పూర్తిచేసి ప్రారంభించేందుకు బల్దియా కసరత్తు చేస్తోంది.
ఇదీ చదవండి: దేశంలో మరో 78,357 కేసులు, 1045 మరణాలు