అద్దె బస్సుల నిర్వాహకుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అద్దె బస్సులు పదిశాతం కూడా రోడ్డెక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులతో పాటు.. అద్దె బస్సులు కూడా ఉన్నాయి. ఆర్టీసీలో 3,170 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. అద్దె బస్సుల మీద సుమారు 15వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. మెకానిక్‌లు, డ్రైవర్లు, క్లీనర్లు ఇలా అనేక మంది వీటిపైనే ఆధారపడ్డారు. ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తే.. ఆర్థిక భారం అవుతుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులకు టెండర్లను పిలిచింది. ఆర్టీసీ కార్పొరేషన్ కావడంతో అనేక మంది ఔత్సాహకులు ఆర్టీసీలో అద్దె బస్సులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ప్రారంభంలో వాటి బకాయిలు బాగానే చెల్లించినా.. తర్వాత ఐదారు నెలలు ఆలస్యమవుతూ వస్తున్నాయి.
ఓనర్ల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు..
ఒక్కో యజమాని ఐదారు బస్సులు కొనుగోలు చేయడంతో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బయట బ్యాంకుల్లో ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి బస్సులు కొనుగోలు చేసిన వారికి ఆలస్యంగా బకాయిలు చెల్లించడంతో బ్యాంకు వాళ్లు అద్దె బస్సుల యజమానుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత లాక్డౌన్లో ఏడెనిమిది నెలలు అద్దె బస్సులను డిపోలకే పరిమితం చేశారు. లాక్డౌన్ 2.0లో సైతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గత ఏప్రిల్15 తర్వాత 50శాతం బస్సులను మాత్రమే నడిపించారు. ఇక మే 12 నుంచి మొత్తం బస్సులు కదిలిన సందర్భం లేదు. దీంతో అద్దె బస్సుల నిర్వాహకులకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.
కష్టాల్లో ఉంటే ఆదుకోలేకపోయాం..
కరోనా బారినపడి తమ బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు ఆసుపత్రుల పాలైనప్పటికీ.. తాము ఆర్థికంగా ఆదుకోలేకపోయామని అద్దె బస్సుల నిర్వాహకులు తెలిపారు. తమ బస్సుల కోసం పనిచేసేవాళ్లు యజమానుల ఇంటికి వచ్చి.. 'ఆపదలో ఉన్నాం. ఆదుకోండని వేడుకున్నా'.. చేసేదేమిలేకపోయిందని అద్దె బస్సుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రొడ్డెక్కేది ఎనిమిది రోజులే..
ఆర్టీసీలో 1996 నుంచి అద్దె బస్సులను నడుపుతున్నామని అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం నేతలు పేర్కొంటున్నారు. కొవిడ్ కారణంగా తమ బస్సులను 2నెలలు పాటు నడపలేకపోయామని.. తద్వారా డ్రైవర్లు, క్లీనర్లు ఆర్థికంగా ఎంతో నష్టపోయామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం తమ బస్సులను నెలలో కేవలం 8రోజులు మాత్రమే నడుపుతున్నారని పేర్కొన్నారు. దీని వలన బస్సుల బిల్లులు రాక.. ఫైనాన్స్‌లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఒక పక్క బస్సులు షెడ్డులకే పరిమితం కాగా.. మరోపక్క డ్రైవర్లు, క్లీనర్లకు మాత్రం జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. దీంతో చేసేదేమిలేక.. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి..
అప్పులు చేసి బస్సులను కొనుగోలు చేశామని వాటి కిస్తీలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి..తమ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా?