నివర్ తుపాను ఏపీలోని 10 జిల్లాలపై ప్రభావం చూపింది. వ్యవసాయ, ఉద్యానశాఖల పరిధిలో సుమారు 5 లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,004 కోట్ల పంటనష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పైరు నీట మునిగింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. భారీవర్షాలు కొనసాగుతుండటం, వరదలు ముంచెత్తడంతో నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్ ఆరంభం నుంచి కురుస్తున్న భారీవర్షాలు, ముంచెత్తుతున్న వరదలతో 20 లక్షల ఎకరాల వరకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ప్రస్తుత భారీ వర్షం మరోసారి వారి ఆశల్ని తుంచేసింది. గుంటూరు జిల్లాలో వ్యవసాయ పంటనష్టం అధికంగా ఉంది. ఇక్కడ 2.60 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలోనూ 70 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రకాశంలో అధికంగా 3,625 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం తలెత్తింది.
వరి రైతుకు కోలుకోలేని నష్టం
ప్రస్తుతం ఖరీఫ్, రబీలకు సంబంధించి 8 జిల్లాల్లో 47.73 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయి. ఇందులో 38 లక్షల ఎకరాల వరకు ఖరీఫ్ పంటలే సాగవుతున్నాయి. ఇందులో 13.59 లక్షల వరకు వరి ఉండగా.. అధికశాతం కోత దశకు చేరింది. ప్రాథమిక అంచనా ప్రకారం 4.29 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో గుంటూరు జిల్లాలో 2.57 లక్షల ఎకరాలు, కృష్ణా జిల్లాలో 70 వేలు, తూర్పుగోదావరి 31వేలు, విశాఖపట్నం 16,300, చిత్తూరు జిల్లాలో 19వేలు, నెల్లూరు 17,900 ఎకరాల వరకు ఉండటం గమనార్హం. విజయనగరం, కడప, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వరి దెబ్బతింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 7వేల ఎకరాల్లో వరి నారుమళ్లు నీట మునిగాయి.
* గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో వరి కోత దశలో ఉంది. ఈ దశలో ఎడతెరపి లేకుండా రెండు రోజులుగా వానలు కురుస్తుండటంతో పైరు నేల వాలింది. కోత కోసిన ఓదెలు నీటిలో తేలుతున్నాయి. పొలాల్లోకి నీరు చేరడంతో కోతలూ నిలిచిపోయాయి. ఇప్పటికే కోసిన వరి ఓదెలపై నీరు చేరింది.
సెనగ, పొగాకు రైతుల్లో కలవరం
రాయలసీమతోపాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో శెనగ సాగు మొదలైంది. ఇప్పటికే 5 లక్షల ఎకరాల్లో విత్తనం వేశారు. కొన్నిచోట్ల పొలాలు సిద్ధం చేసి ఉంచారు. పొలాల్లో నీరు నిలవడంతో.. మొలకెత్తిన సెనగకు నష్టం తప్పదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. చిత్తూరు జిల్లాలో రబీ వేరుసెనగ, ఉలవ పైర్లు నీటిలో ఉన్నాయి. ప్రకాశంలో రబీ మినుము అక్కడక్కడా నీట మునిగింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగనారు నాటుతున్నారు. వర్షాలకు నీరు నిలవడంతో మొక్కలు ఉరకెత్తి చనిపోతాయేమో అనే భయం రైతుల్లో వ్యక్తమవుతోంది.
కూరగాయలు, పండ్లతోటలకు నష్టం
భారీవర్షాలతో 7వేలకు పైగా ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొన్నిచోట్ల పసుపు, ఉల్లి పంటలతోపాటు పూలతోటలూ నీట మునిగాయి. నష్టం మరింత పెరిగే అవకాశముంది. కడప జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో ఉద్యాన పంటల రైతులు నష్టపోయారు. అక్టోబరులో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న మిరప ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
ఇవీచూడండి: ఏపీలో ఎడతెగని వర్షం.. ఈదురుగాలుల బీభత్సం..