భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి రాష్ట్రాలకు నిధులు ఇవ్వదు. సివిల్ పనులకు సొమ్ములు అవసరమని ప్రతిపాదించిన ప్రతి రాష్ట్రానికీ తమ నుంచి నిధులు ఆశించవద్దని కేంద్ర విద్యాశాఖ అధికారులు తేల్చిచెప్పారు. సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) సమావేశాల సందర్భంగా ఈమేరకు స్పష్టం చేశారు. 'నిర్మాణ పనులకు ఇంకెన్ని దశాబ్దాలు ఇస్తాం.. విద్యానాణ్యత పెంచే కార్యక్రమాలకే మా ప్రాధాన్యం' అని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్‌ఎస్‌ఏ కింద రాష్ట్రానికి మొత్తం రూ.1450 కోట్లకు ఆమోదం తెలిపిన కేంద్రం.. అందులో శౌచాలయాలు, తాగునీరు, విద్యుత్తు సరఫరా, అదనపు తరగతి గదుల కోసం కేవలం రూ.32 కోట్లకే ఆమోదం తెలపడం గమనార్హం. గతంలో వాటికి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఇచ్చేదని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 'మౌలిక వసతులకు నిధులు అవసరమైతే రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు.. మీ ఇష్టం' అని కేంద్ర అధికారులు స్పష్టం చేసినట్లు మరో అధికారి తెలిపారు.
2025 నాటికి కనీస విద్యా సామర్థ్యాల సాధనే లక్ష్యం
పిల్లల అభ్యసన సామర్థ్యాలపై జాతీయ నూతన విద్యావిధానం కేంద్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అభ్యాస సంక్షోభం నెలకొందని వ్యాఖ్యానించింది. మూడో తరగతి పూర్తయ్యేలోపు ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, అంకెలకు సంబంధించి నేర్చుకునేలా తీర్చిదిద్దాలని, ఆ లక్ష్యాన్ని 2025 నాటికి చేరుకోవాలని నిర్దేశించింది. అందుకు అనుగుణంగా ఈసారి సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆమోదిత మండలి(ఎస్‌ఎస్‌ఏ పీఏబీ) సమావేశాలు జరిగాయి. అదే విషయాన్ని సమావేశం తీర్మాన పత్రాల్లో కేంద్రం పొందుపరిచింది. అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్లాలంది. అందుకు అక్షరాస్యత పునాది, గణితశాస్త్రం (ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ) మిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని కోరింది. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్(నిష్టా) పేరిట ప్రతి ఉపాధ్యాయుడికి ఏటా 50 గంటల శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: Educational Survey: బడుల మూతతో బండబారిపోతోన్న పిల్లల చదువులు.. ఈటీవీభారత్ సర్వే ఫలితాలు