Electricity Charges Increase : కరెంటు ఛార్జీల పెంపు ఈ సారి భారీగానే ఉండనుంది. అయిదేళ్లుగా ఒక్కపైసా కూడా ఛార్జీ పెంచనందున నష్టాలు, ఆర్థికలోటు పెరిగిపోయాయని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రభుత్వానికి నివేదించాయి. ఒక్కో యూనిట్‌కు సగటున రూపాయి చొప్పున ఛార్జీలు పెంచితే తప్ప ఆర్థిక కష్టాలు తీరవని డిస్కంలు భావిస్తున్నాయి. యూనిట్‌కు 5 లేదా 10 పైసలు పెంచితే కష్టాలు తీరవని, సుదీర్ఘ కాలం తరవాత పెంచుతున్నందున ఆర్థికంగా చేయూతనిచ్చేలా పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ సంస్థలు యోచిస్తున్నాయి.
Electricity Charges Increase in Telangana : ప్రస్తుత, వచ్చే ఏడాది కలిపి రూ.21,552 కోట్ల మేర ఆర్థికలోటు ఉంటుందని డిస్కంలు ప్రభుత్వానికి, ఈఆర్‌సీకి తెలిపాయి. ఇవి కాకుండా ఏటా రూ.6 వేల కోట్ల నష్టాలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా సగటున 4 వేల కోట్ల యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు ప్రజలకు విక్రయిస్తున్నాయి. యూనిట్‌కు సగటున రూపాయి చొప్పున పెంచితే ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం అదనంగా వస్తుంది. ప్రస్తుత ఛార్జీలను కొనసాగిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం(2022-23) రూ.10,928 కోట్లు లోటు ఉంటుందని, యూనిట్‌కు రూపాయి చొప్పున ఛార్జీలు పెంచినా రూ.6,928 కోట్లు లోటు కొనసాగుతుందని అంచనా. ఛార్జీల పెంపును భారంగా భావించకుండా యూనిట్‌కు కనీసం రూపాయి చొప్పున పెంచేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆమోదం పొందాక విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి ఇవ్వాలని డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి.
వారం రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వాలి..
Electricity Charges Hike : ఛార్జీల పెంపు ప్రతిపాదనలు వారం రోజుల్లో అందజేయాలని రాష్ట్ర డిస్కంలకు ఈఆర్‌సీ గురువారం ఆదేశాలు జారీచేసింది. వచ్చే ఏడాది(2022-23)కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్) నివేదికను ఇటీవల డిస్కంలు మండలికి సమర్పించాయి. ఛార్జీల సవరణ ప్రతిపాదనలు మాత్రం అందజేయలేదు. వాటిని ఇప్పటి వరకు తయారు చేయలేదని డిస్కంలు తెలిపాయి. వెంటనే తయారుచేసి పంపాలని ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలకు గురువారం ఈఆర్‌సీ సూచించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) నుంచి కరెంటు ఛార్జీలు పెంచాలంటే నవంబరు 30కల్లా ప్రతిపాదనలు ఇవ్వాలి. వాటిపై తుది తీర్పు ఇవ్వడానికి కనీసం 120 రోజుల సమయం ఉండాలని విద్యుత్ చట్టం చెబుతోందని ఈఆర్‌సీ రాసిన లేఖలో గుర్తుచేసింది. అసలు ఛార్జీలపై ప్రతిపాదనలే ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఆ నివేదిక ఎందుకూ పనికిరాదని, దాన్ని ప్రజల ముందు కూడా పెట్టలేం అని మండలి ఛైర్మన్ శ్రీరంగారావు చెప్పారు.