Telangana letter to central government: ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)కు బకాయిలు చెల్లించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీచేసిందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. తెలంగాణ విద్యుత్ సంస్థల వాదన వినకుండా ఆదేశాలివ్వడం సరికాదని, ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖకు లేఖ రాయాలని మంగళవారం నిర్ణయించింది.
TS Govt letter to Centre over Electricity dues : 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకూ ఏపీ జెన్‌కో కరెంటు సరఫరా చేసినందుకు మొత్తం రూ.6,756.82 కోట్ల బకాయిలు(వడ్డీతో కలిపి) చెల్లించాలని కేంద్ర విద్యుత్‌శాఖ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి ఏపీ విద్యుత్ సంస్థల నుంచే తెలంగాణకు రూ.12,940 కోట్లు రావాలని ఆ వివరాలు సహా కేంద్రానికి గతంలో నివేదిక ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పైగా ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టును సైతం రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆశ్రయించాయి. ఈ కేసు విచారణలో ఉండగా బకాయిలు చెల్లించాలని ఏకపక్షంగా కేంద్రం ఉత్తర్వులు ఎలా ఇస్తుందని డిస్కంలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ నుంచే అధికంగా సొమ్ము రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం నివేదించాయి. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఉత్తర్వులు ఎలా ఇస్తారని, ఏపీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఎందుకు ఇప్పించడం లేదని కేంద్రానికి లేఖ రాసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: