Telangana tops in ODF Plus Ranking : బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిషేధించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తూ ఓడీఎఫ్(ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) ప్లస్ స్థాయి పొందిన టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ దేశంలోని 1,01,462 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ స్థాయిని పొందాయి. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు టాప్ ఐదు గా ఉన్నాయి. అత్యధిక గ్రామాలు ఈ అయిదు రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిపింది.
సాంకేతికంగా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో ఉన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుంటే లక్ష గ్రామాలు ఈ స్థాయిని పొందడం సాధారణ విషయం కాదని కేంద్ర జల్‌శక్తి శాఖ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా మెరుగుపడిన అనంతరం మురుగునీరు ఎక్కువ ఉత్పత్తి అవుతోందని, దాన్ని శుద్ధిచేసి మళ్లీ వినియోగించుకోవాల్సి వస్తోందని వివరించింది.అలాగే జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల వినియోగం పెరిగిపోయిందని తెలిపింది. దీంతో ప్లాస్టిక్ సమస్యనూ సమర్థంగా పరిష్కరించాల్సి ఉందని జల్‌శక్తిశాఖ చెప్పింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కొత్త కావున రాష్ట్రాలకు నిధులపరంగా, సాంకేతికంగా అన్నివిధాలా కేంద్రం సహకరిస్తున్నట్లు పేర్కొంది.
2024-25నాటికల్లా సంపూర్ణ స్వచ్ఛభారత్ సాధించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు తాగునీరు అందించే టాప్-3 రాష్ట్రాల్లోనూ తెలంగాణ నిలిచినట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ పేర్కొంది. రాష్ట్రాలపరంగా చూస్తే.. గోవా, తెలంగాణ, హరియాణ, కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి, దాద్రానగర్‌హవేలీ దయ్యూదామన్, అండమాన్‌నికోబార్ దీవులు 100% ఇళ్లకు నల్లా నీరు అందిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 117 ఆకాంక్షిత(వెనుకబడిన) జిల్లాల్లో తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పంజాబ్‌లోని మోగా, హరియాణాలోని మేవాట్, హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలు 100% గ్రామీణ కుటుంబాలకు నల్లా నీరు అందిస్తున్నట్లు వెల్లడించింది.