Telangana Joined in VAHAN : కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ 2019లో వాహన్ (వాహనాల రిజిస్ట్రేషన్), సారథి (డ్రైవింగ్ లైసెన్స్) పేర్లతో రూపొందించిన రవాణా పోర్టల్‌లో తెలంగాణ చేరింది. దీంతో ఇప్పటివరకు ఉన్న వాటికి భిన్నమైన రంగు కార్డులను రవాణాశాఖ అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డులు ఒకే తీరుగా ఉండనున్నాయి. కేంద్ర పోర్టల్ ద్వారా వాహనం ఏ రాష్ట్రానిది.. లైసెన్స్ పొందిన వ్యక్తి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.
ఒకే దేశం.. ఒకే కార్డు
Vahan Portal : వాహనాల దొంగతనం జరిగినా, విధ్వంసకర సంఘటనల్లో ఉపయోగించినా, ప్రమాదాలప్పుడు క్షణాల్లో సమాచారం తెలుసుకోవడానికి ‘ఒకే దేశం.. ఒకే కార్డు’ నినాదంతో ఈ పోర్టల్‌ను రూపొందించామని కేంద్రం చెబుతోంది. వాహనం ఏ విభాగానికి చెందిందో తెలుసుకునేందుకు కార్డు రెండు వైపులా వివరాలుంటాయి. రవాణాయేతర(వ్యక్తిగత) వాహనమైతే ‘ఎన్‌టీ¨’ అని రవాణాదైతే ‘టీ¨’ అని ముద్రిస్తున్నారు. ఆ కార్డు ఏ రాష్ట్రానికి చెందిందో తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణకు ‘టీ¨ఎస్’ అని..ఆంధ్రప్రదేశ్ అయితే ‘ఏపీ’ అని నమోదు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల కార్డులపైనా ఇదే తరహాలో పేర్కొంటున్నారు. కార్డుపై ముద్రించే అక్షరాల సైజు..ఫొటో ఎక్కడ ఉండాలి. చిప్ ఎక్కడ పెట్టాలి తదితర వివరాలను కూడా కేంద్రమే నిర్దేశించింది.
సికింద్రాబాద్ నుంచే షురూ..
One Country.. One Card: ఆ పోర్టల్‌లో చేరేందుకు తెలంగాణ రవాణా శాఖ తొలుత సుముఖత చూపలేదు. తాజాగా భాగస్వామి అయ్యేందుకు నిర్ణయించి నూతన కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ ఆర్టీవో కార్యాలయాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది. ఈ కార్యాలయ పరిధిలోని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్‌ల సమాచారమంతటినీ వాహన్, సారథి పోర్టల్‌లో అనుసంధానం చేసే ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రయత్నం సాఫీగా సాగిన పక్షంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకూ విస్తరించాలని రవాణాశాఖ నిర్ణయించింది. తెలంగాణలో 1.45 కోట్ల వాహనాలు, రెండు కోట్లకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. అన్నీ అనుసంధానమయ్యేందుకు ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుందని అంచనా.
- ఇదీ చదవండి : ఒకే దేశం-ఒకే విధానంతో మోదీ స్వప్నం నెరవేరేనా?