రేపట్నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల సన్నద్ధత ఏర్పాట్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్పీకర్, ప్రొటెం ఛైర్మన్ సమావేశమయ్యారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సమావేశంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన సభల సమావేశాలు సమర్థంగా జరుగుతున్నాయని... ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో కరోనాను సమర్థంగా అరికట్టేందుకు కృషి చేసిన ప్రభుత్వం, అధికారులకు సభాపతి పోచారం అభినందనలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నీతిఆయోగ్ ఛైర్మన్ సైతం ప్రశంసించారని అన్నారు. రేపట్నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరిన ఆయన... సభ్యులు అడిగే సమాచారాన్ని త్వరగా అందించాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని చెప్పారు. సమావేశాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పోచారం సూచించారు. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులతో శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్ సమావేశమయ్యారు. సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుశాఖ నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందించాలని కోరారు.