దేశంలో బొగ్గుకు డిమాండు పెరగడంతో సింగరేణి(Telangana Singareni) కీలకంగా మారింది. దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాలు సైతం సింగరేణి బొగ్గును అడుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల విద్యుత్కేంద్రాలు అదనంగా బొగ్గు పంపాలని సింగరేణిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఒక్కసారిగా గిరాకీ పెరిగినా, అందుకు తగ్గట్టు సింగరేణి సరఫరా చేయలేని స్థితి. కొత్త గనుల తవ్వకాలు, విస్తరణ, ఆధునికీకరణ తదితర అంశాల్లో జాప్యం వల్ల సంస్థ ఉత్పత్తిని పెంచలేకపోతోంది.
విద్యుత్తు సంక్షోభ నివారణకు వీలైనంత అదనపు బొగ్గు పంపాలని సింగరేణి(Telangana Singareni) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో ఇంతకాలం 92 శాతం విద్యుత్కేంద్రాలకు, మిగిలిన 8 శాతం సిమెంటు, ఇనుము వంటి ఇతర పరిశ్రమలకు ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమలకు సరఫరా నిలిపివేసి వంద శాతం బొగ్గును విద్యుత్కేంద్రాలకే పంపాలని సింగరేణి తాజాగా నిర్ణయించింది. ఈ సంస్థ సాధారణంగా రోజుకు 30 నుంచి 32 గూడ్సు రైళ్లలో పలు రాష్ట్రాల విద్యుత్కేంద్రాలకు బొగ్గు పంపుతోంది. ప్రస్తుత డిమాండు తీర్చాలంటే దాన్ని 40 రైళ్లకు పెంచాలి. అంటే రోజుకు 30 శాతం అదనంగా ఉత్పత్తి చేయాలి. కానీ సింగరేణిలో పరిస్థితులు అందుకు అనువుగా లేవు.
పాత కోటా అడుగుతున్న రాష్ట్రాలు
గత ఏప్రిల్ నుంచి జూన్ వరకూ మహారాష్ట్ర, ఏపీ, విద్యుత్కేంద్రాలు సింగరేణి(Telangana Singareni) బొగ్గును పెద్దగా తీసుకోలేదు. ఇప్పుడు కొరత ఏర్పడడంతో అప్పటి కోటాను కూడా అడుగుతున్నాయని సింగరేణి వాదిస్తోంది. అప్పటి లెక్కలు కూడా పరిగణిస్తే, ఇప్పటికి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక కేంద్రాలకు తక్కువగా సరఫరా చేసినట్లు తేలింది. ఈ విషయాన్నే కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) తాజా నివేదికలో స్పష్టం చేసింది. మహారాష్ట్ర విద్యుత్కేంద్రాలకు ఏటా 30 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని సింగరేణితో ఒప్పందముంది. అంతఇస్తున్నా ఇంకా కావాలని అడుగుతున్నారు. మహారాష్ట్ర విద్యుత్కేంద్రాలకు 70% బొగ్గు వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ నుంచి రావాలి. అక్కడ కొరత ఏర్పడటంతో సింగరేణిపై ఒత్తిడి పెరిగింది. మహారాష్ట్రకు ఇక్కడినుంచి మరో రైలు లోడు మాత్రమే అదనంగా పంపుతున్నారు.
ఉత్తరాది ఎన్టీపీసీ ప్లాంట్లకూ...
కొరత నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్‌లలోని ఎన్టీపీసీ ప్లాంట్లకు కూడా తెలంగాణ నుంచి సింగరేణి బొగ్గు(Telangana Singareni) సరఫరా చేస్తున్నారు. ఆ ప్లాంట్లకు ఈ ఏడాది సింగరేణి 30 లక్షల టన్నుల బొగ్గు విక్రయిస్తోంది. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల గనుల నుంచి కాకినాడకు రైళ్లలో, అక్కడి నుంచి సముద్రమార్గంలో గుజరాత్, పంజాబ్, రాజస్థాన్‌లకు రవాణా చేస్తున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ ప్లాంటుకు రోజూ 35 వేల టన్నుల బొగ్గును సింగరేణి ఇస్తోంది. ఈ ప్లాంటులో ఉత్పత్తవుతున్న విద్యుత్తు 5 రాష్ట్రాలకు వెళుతోంది.
ఇదీ సింగరేణి ఉత్పత్తి ముఖచిత్రం
ఈ ఏడాది 7 కోట్ల టన్నుల బొగ్గు విక్రయాలు సింగరేణి లక్ష్యం. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఆరు నెలల్లో 2.99 కోట్ల టన్నులు తవ్వి.. దానిపై రూ.10,071 కోట్లు ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలవ్యవధిలో ఉత్పత్తి కేవలం 1.81 కోట్ల టన్నులు. ఆదాయం రూ.5573 కోట్లు.
సింగరేణి ఉత్పత్తి పెంచడానికి ఉపరితల గనుల్లో మట్టి తొలగింపు పనులు వేగిరం చేసింది. కొత్త గనుల తవ్వకాలు శరవేగంగా పూర్తయితే తప్ప ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెంచడం కష్టమని అధికారులు చెబుతున్నారు.