Domestic Violence Complaint App : మహిళా పోలీస్‌స్టేషన్.. సఖి కేంద్రం.. డయల్ 100.. ఇలా గృహహింసపై ఏ విభాగానికి ఫిర్యాదులు వచ్చినా తెలిసేలా తెలంగాణ మహిళా భద్రత విభాగం ఒక ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటివరకు ఏ విభాగానికి వచ్చిన ఫిర్యాదు అక్కడికే పరిమితమవుతోంది. అదే బాధితురాలు మరో విభాగానికి వెళ్తే కొత్త ఫిర్యాదుగా కనిపిస్తోంది. ఇలాంటి సమస్యలను అధిగమించే ప్రయత్నం చివరి దశకు చేరుకుంది. ఈ కేసులకు సంబంధించిన వివరాలన్నింటినీ ఒకే వేదికపై కనిపించేలా ప్రత్యేకమైన యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు డయల్ 100కు వచ్చే గృహహింస ఫిర్యాదులను ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తున్నారు. నిత్యం 250-300 వరకు వస్తున్న ఈ ఫిర్యాదుల్ని మరుసటిరోజు మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలోని కౌన్సెలింగ్ కేంద్రంతో అనుసంధానిస్తారు.
మూడూ ఒకే దగ్గర
Domestic Violence Complaints :తదుపరి అవసరాన్ని బట్టి షీ బృందాలకు బదిలీ చేస్తున్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 30 మంది వరకు నిపుణులైన కౌన్సెలర్లతోపాటు 40 మంది వాలంటీర్లున్నారు. సిబ్బంది కొరత కారణంగా ఈ ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించడం సాధ్యం కావడం లేదు. మరోవైపు అన్ని జిల్లాల్లోని సఖి కేంద్రాల (వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్లు)కూ 181 నంబరు ద్వారా నిత్యం గృహహింస ఫిర్యాదులొస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితురాళ్లు అటు సఖి కేంద్రాలకు, ఇటు డయల్ 100కు, మహిళా పోలీస్‌స్టేషన్‌కూ ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఒకే బాధితురాలు వేర్వేరు వేదికలపై ఇచ్చే ఫిర్యాదులను సమీక్షించాల్సి వస్తోంది. ఈ మూడు వేదికల్ని ఒకే గూటి కిందకు తీసుకురావడం ద్వారా సమయం, శ్రమ ఆదా అవుతాయనే ఉద్దేశంతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. యాప్ అందుబాటులోకి వస్తే ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ వేగవంతమవుతుందనే భావన వ్యక్తమవుతోంది.