ప్రస్తుత వానాకాలం సీజన్(Kharif season)లో రాష్ట్రంలో విస్తారంగా పంటలు సాగయ్యాయి. అయితే.. వరి మినహా మిగిలిన పంటలను మద్దతు ధరకు(support price) కొనే అవకాశాలు కనిపించడం లేదు. మొక్కజొన్న(support price for corn crop)ను మద్దతు ధరకు కొంటామని రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్‌ఫెడ్(telangana markfed)) అనుమతి అడిగినా.. రాష్ట్ర ప్రభుత్వం(telangana government) స్పందించలేదు. పంటల కొనుగోళ్లు లేక మార్క్‌ఫెడ్ ఏడాదిగా ఖాళీగానే ఉంటోంది.
మొక్కజొన్న పంట వర్షాలు, తెగుళ్లకు చెడిపోతుండగా.. చేతికొచ్చే కొద్ది దిగుబడికీ ధర కరవై రైతులు నష్టపోతున్నారు. ఈ పంటకు మద్దతు ధర రూ.1870 ఇవ్వాలని కేంద్రం ఆదేశించినా.. వ్యాపారులు రూ.1600కే కొనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న పంట(corn crop)ను తెలంగాణలో మద్దతు ధరకు కొనడానికి కేంద్రం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం(telangana government) కూడా సొంతంగా కొనేది లేదని సంకేతాలిచ్చింది. దీంతో తమకు పోటీ లేదని భావిస్తున్న వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఈ సీజన్‌లో మొక్కజొన్న పంట 7.04 లక్షల ఎకరాల్లో సాగవగా 13.81 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. వ్యాపారులు క్వింటాకు రూ.200 తగ్గించి కొనుగోలు చేసినా రైతులు రూ.27.62 కోట్ల మేరకు నష్టపోయే అవకాశముంది.
మద్దతు ధర ఇవ్వడం లేదు..

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు పేరు రాజమ్మ. నిర్మల్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన ఈ రైతు ఈ వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఓ వైపు వర్షాలు.. మరో వైపు తెగుళ్ల కారణంగా ఆశించిన దిగుబడి రాలేదని, చేతికొచ్చిన కొద్దిపాటి పంటకూ వ్యాపారులు మద్దతు ధర ఇవ్వడం లేదని ఆ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
క్వింటాకు రూ.2 వేల దాకా నష్టం
సంగారెడ్డి జిల్లా ఉట్‌పల్లి గ్రామానికి చెందిన రైతు రవీందర్‌రెడ్డి మూడెకరాల్లో పెసర పంట సాగు చేశారు. వర్షాలకు పంట దెబ్బతినడంతో 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా మద్దతు ధర రూ.7,275 కాగా.. వ్యాపారి రూ.5,300 చొప్పున చెల్లించారు. దీంతో క్వింటాకు రూ. 2 వేల వరకు నష్టపోయానని రైతు వాపోయారు.
ఇతర పంటలదీ అదే దారి!
వానాకాలం(monsoon crops)లో సాగైన పెసర, మినుము పంట దిగుబడిలో 25 శాతం కొనడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుమతి ఇచ్చింది. అయితే.. మార్కెట్‌లో మద్దతు ధరకన్నా వ్యాపారులు ఎక్కువ చెల్లిస్తున్నారన్న ఉద్దేశంతో మార్క్‌ఫెడ్(telangana markfed) కొనుగోలు కేంద్రాలను తెరవడం లేదు. వ్యాపారులు చాలా చోట్ల ధరలు తగ్గించి రైతులను నష్టపరుస్తున్నారు. రాష్ట్రంలో 7.60 లక్షల ఎకరాల్లో కంది సాగవగా 4.60 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో లక్షా 15 వేల టన్నులే కేంద్రం కొంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటి కొనుగోలుకైనా అనుమతించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
ఆదాయమెలా..?
పంటలను మద్దతు ధరకు కొంటేనే వాటిపై కమీషన్ రూపంలో మార్క్‌ఫెడ్(telangana markfed)కు ఆదాయం వస్తుంది. గతేడాది నవంబరులో మొక్కజొన్న పంటను, గత ఏప్రిల్‌లో పరిమితంగా జొన్న పంటను కొనుగోలు చేసింది. గతేడాది నుంచి సరిగ్గా కొనుగోళ్లు జరగక, సంస్థకు ఆదాయం కరవై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు. సంస్థ గతంలో తీసుకున్న అప్పులకు నెలకు రూ.20 కోట్ల దాకా బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని నెలల తరవాత వడ్డీ చెల్లించే స్తోమత లేక ఆర్థిక సంక్షోభంలో పడేప్రమాదముందని వారు ఆందోళన చెందుతున్నారు. పంటలను కొనుగోళ్లతో రైతులకు మేలు చేస్తూ సంస్థను లాభాలబాట పట్టించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.