మూసీ నది పరీవాహకం.. ఒకప్పుడు గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. నాడు భాగ్యనగర వైభవాన్ని ప్రతిబింబించిన ఈ నది నేడు విషతుల్యంగా మారింది. భూగర్భం కూడా మలినమై జలాలు కంపుకొడుతున్నాయి. ఘాటైన రసాయనాలు కడుపు దేవేస్తున్నాయి. వికారాబాద్- రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని అనంతగిరి కొండల్లో మూసీ పురుడు పోసుకుంటుంది. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఈ నదిలో కాలకూట విషం ప్రవహిస్తోందంటే ఆశ్చర్యం లేదు. ఉప్పల్, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల పరిధిలో కాలుష్యం అధికంగా ఉంది. దాదాపు 66 గ్రామాలు కాలుష్య ప్రభావాన్ని నేరుగా ఎదుర్కొంటున్నాయి. ఈ గ్రామాల ప్రజలు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. భూగర్భమంతా విషతుల్యంగా మారడంతో అందరూ ఆర్‌ఓ ప్లాంట్ల నీటిని తాగుతున్నారు. ఇవి గ్రామానికి కనీసం రెండైనా ఉన్నాయి. 3 వేల జనాభా ఉన్న పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలో 5 ఉన్నాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నా.. లీకేజీలతో మురుగు నీరు పైపుల్లోకి చేరుతోందని కొందరు చెబుతున్నారు.
పశువులకూ రోగాలు
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాచారం, కొర్రెముల గ్రామాల్లో 400 వరకు పాడి గేదెలు ఉన్నాయి. ఇవన్నీ మూసీ తీరంలోనే పచ్చిగడ్డి మేస్తాయి. ఇక్కడి పొలాల్లో పండే వరి ఎండుగడ్డినే తింటాయి. మేతకు వెళ్లిన సమయంలో కాలువలు, నదిలో నీటిని తాగుతుండటంతో ఏదో ఒక అనారోగ్యానికి గురవుతున్నాయి. దాదాపు నెలలో ఒక్కటైనా సూదిమందు పడని పశువు ఉండదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తరచుగా గొంతువాపు, నోట్లో కురుపులు, కడుపు ఉబ్బరం, గర్భస్రావాలు, జ్వరం బారిన పడుతుంటాయని రైతులు చెబుతున్నారు. మూసీ పరీవాహక ఇతర మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ‘మూసీ నీళ్లు తాగితే పాల దిగుబడి కూడా తగ్గిపోతోందని పాడి రైతులు వాపోయారు.
జీవవైవిధ్యం కనుమరుగు
ఇరవై ఏళ్ల క్రితం 25 రకాల చేపలకు ఆవాసం ఈ నది. నేడు కేవలం మార్బుల్స్, ఒకటి రెండు నాటు రకాలు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. ‘‘విదేశీ పక్షుల రాక తగ్గిపోయింది. గతంలో పది రకాల కొంగలు కనిపించేవి. ప్రస్తుతం ఒకటి, రెండు రకాలే కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు
జీహెచ్ఎంసీ పరిధిలో
ప్రధాన కారణాలు ఇవే...
- హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలో నిత్యం 1500 మిలియన్ లీటర్ల మురుగు, మానవ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో 750 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే శుద్ధి చేసే యూనిట్లు (ఎస్‌టీపీ) ఉన్నాయి. మిగిలిన మురుగు, మానవ వ్యర్థాలు మూసీలో నేరుగా కలుస్తున్నాయి.
- హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు కూడా నదిలో కలుస్తున్నాయి. సమీప ఇతర ప్రాంతాల్లోని రసాయన పరిశ్రమల వ్యర్థాలు, ఉద్గారాలను రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా నదిలో పారబోస్తున్నారు.
- తాగు నీటిలో ప్రమాణాల మేరకు అన్ని రకాల లవణాలు కలిపి (టీడీఎస్) లీటరుకు 250-500 మిల్లీగ్రాముల మధ్య ఉండాలి. మూసీ పరీవాహకంలోని పోచంపల్లి గ్రామ బోరు నీటిలో ఇది 1300 మి.గ్రా./లీ ఉంది. గ్రామానికి సరఫరా అవుతున్న భగీరథ నీటిలో 250 ఉంది. నెల రోజుల క్రితం మిషన్ భగీరథ అధికారులు గ్రామస్థుల ముందు పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. భగీరథ నీటినే తాగాలని అవగాహన కల్పించారు.
మూసీ నదిపై 12 చెక్‌డ్యాంలు ఉన్నాయి. ఈ నది నీటితో పది వేల ఎకరాలు సాగు చేస్తున్నారు. వరి, ఆకు కూరలు ఎక్కువగా పండిస్తున్నారు. మూసీ నీరు తాకితే దురద, దద్దుర్లు వస్తున్నాయని రైతులు తెలిపారు. వర్షాకాలంలో కూలీలు నాట్లు వేసేందుకు జంకుతున్నారని జూలూరు రైతులు చెప్పారు.
ఇదీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు