Gaddiannaram Fruit Market: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. మార్కెట్‌ను వెంటనే తెరవాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని మార్కెటింగ్‌శాఖను ఆదేశించింది.
1986లో చైతన్యపురిలో 22 ఎకరాల్లో ఏర్పాటైన ఈ పండ్ల మార్కెట్ ఏర్పాటైంది. ట్రాఫిక్ సహా ఇతర కారణాలతో ఈ పండ్ల మార్కెట్‌ను నగర శివారులోని కొహెడ్కు తరలించాలని నిర్ణయించింది. కొహెడ్‌లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేంతవరకు బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్‌లో తాత్కాలికంగా ఏర్పాటుచేయాలని భావించింది. ఈ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ నిర్ణయంపై కమీషన్ ఏజెంట్లు సహా చిరు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించారు. అయితే పలుమార్లు ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ మేరకు డిసెంబర్ రెండోవారంలో ఆదేశాలు జారీచేసింది.
అయితే వ్యాపారాలను బాటసింగారం తాత్కాలిక మార్కెట్‌కు తరలించేందుకు వీలుగా నెల రోజులపాటు గడ్డి అన్నారం మార్కెట్‌ను తెరవాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు అమలుచేయడం లేదంటూ వ్యాపారులు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం ఇవాళ విచారణకు వచ్చింది. తమ ఆదేశాలను అమలుచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే గడ్డి అన్నారం మార్కెట్ తెరిచి.. మార్కెట్ కమిటీ కార్యదర్శి హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర ధర్మాసనం ఆదేశించింది. దీంతో హుటాహుటిన మార్కెట్ తెరవడం సహా కమిటీ కార్యదర్శి హైకోర్టుకు హాజరై ఫోటోలను సమర్పించారు. అనంతరం ఈ వ్యాజ్యంపై విచారణను ఏప్రిల్ 6కి వాయిదా వేసింది.
ఇదీచూడండి: 'ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు చవిచూశాం.. బాంబుల మోతతో కీవ్ దద్ధరిల్లింది'