HC Hearing on Bandi Sanjay Padayatra : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా బండి సంజయ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనేందుకు వీడియోలు, ఎఫ్ఐఆర్లు తదితర ఆధారాలుంటే ఇవాళ సమర్పించాలని పోలీసులను బుధవారం రోజున న్యాయస్థానం ఆదేశించింది. బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆపకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భాజపా తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ లలిత కన్నెగంటి నిన్న విచారణ చేపట్టారు.
ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని హోంశాఖ, పోలీసుల తరఫు న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పోలీసులు లిఖిత పూర్వక అనుమతి ఇవ్వలేదని.. అయితే పాదయాత్రకు మౌఖికంగా అంగీకరించి ఇన్నాళ్లూ భద్రత కూడా కల్పించారని భాజపా తరఫు న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. లిఖితపూర్వక అనుమతి లేదన్న విషయం రెండు వైపులా అంగీకరిస్తున్నందున.. ఆ అంశంపై వాదనలు అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
బండి సంజయ్ తరచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. బండి సంజయ్‌పై ఇప్పటికే 15 కేసులు నమోదయ్యాయని.. విద్వేషపూరిత ప్రసంగాల వీడియో రికార్డిగులు కూడా ఉన్నాయన్నారు. పాదయాత్రకు సంబంధం లేని కేసులను ప్రస్తావిస్తున్నారని.. శాంతిభద్రతలకు భంగం కలుగుతుందేమోనని ఊహించి ఆపడం తగదని భాజపా తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. బండి సంజయ్ రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు, ఎఫ్ఐఆర్లు ఉంటే సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ... ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ ఉదయం పదిన్నరకు విచారణ చేపడతామని తెలిపింది.
- ఇవీ చూడండి.. అనుమతి లేకుండా ఇన్ని రోజులు పాదయాత్ర ఎలా జరిగిందన్న హైకోర్టు
- ఈనెల 27న యథాతథంగా వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో భాజపా సభ