ఆరోగ్యశ్రీ నిధులను ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించే బదులుగా.. వాటితో సర్కారు దవాఖానాలను బలోపేతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీని పునరుద్ధరించడం, ఆరోగ్య శ్రీ నిధులను ప్రైవేటు ఆస్పత్రులకు కాకుండా ప్రభుత్వ దవాఖానాలకు ఇవ్వాలంటూ పేరాల శేఖర్ రావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆరోగ్యశ్రీని పునరుద్ధరించినట్లు అడ్వొకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఏజీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఆ అంశంపై విచారణ అవసరం లేదని పేర్కొంది. ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఆస్పత్రుల కోసం ప్రవేశపెట్టినట్లుందని.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. స్పందించిన ధర్మాసనం అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతుంటే అంతకన్నా కావాల్సిందేముందని వ్యాఖ్యానించింది. బెంగళూరు కన్నా హైదరాబాద్లోనే అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయన్న ధర్మాసనం.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.
ఇవీ చూడండి: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియామకం