Telangana HC on Abhishek Mohanty : కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని సర్వీసులోకి తీసుకుంటారో? లేదో ఈనెల 14లోగా చెప్పాలని ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తే అవి మొహంతితో పాటు చీఫ్ సెక్రటరీ (సీఎస్) సోమేశ్‌కుమార్ సహా 16 మందికి వర్తిస్తాయని స్పష్టం చేసింది. క్యాట్ ఆదేశాలను ముందు అమలు చేయాలని, సీనియర్ ఐపీఎస్ అధికారిని ఏడు నెలలుగా ఖాళీగా ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. వ్యక్తిగత హోదాలో సీఎస్ సోమేశ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌లో అడ్వొకేట్ జనరల్ హాజరుకావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
Telangana High Court on Abhishek Mohanty : క్యాట్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ నుంచి రక్షణ కల్పించాలంటూ సీఎస్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై గురువారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ తెలంగాణ లేఖకు సమాధానమిచ్చామని, కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిందేమీ లేదన్నారు. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌లు ఈనెల 24న విచారణకు రానున్నాయని, అప్పటివరకు క్యాట్ కోర్టు ధిక్కరణ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈనెల 11న సీఎస్ హాజరు అంశం ప్రస్తావించగా.. స్టే ఇవ్వడానికి అభ్యంతరంలేదని పేర్కొంటూ ఆ రోజు హాజరుకు మినహాయింపు ఇచ్చింది. ఏపీకి చెందిన అధికారిని రిలీవ్ చేశారని, ఆమె అక్కడ పోస్టింగ్ తీసుకున్నారని, ఇక్కడ మొహంతిని ఎందుకు నిరాకరిస్తున్నారంది. ఏజీగా ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వాలంటూ, ఉత్తర్వుల అమలుపై నిర్ణయం చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది.