కరోనా టెస్టుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్న ప్రైవేటు ల్యాబ్‌లు 48 గంటల్లో తప్పులను సరిదిద్దుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బీఆర్కే భవన్లో అధికారులతో మంత్రి ఈటల సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్, ప్రొఫెసర్ విమలా థామస్ పాల్గొన్నారు.
ప్రైవేటు ల్యాబ్‌ల పనితీరుపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ నియమించిన కమిటీ చేసిన మార్గదర్శకాలు పాటించకుండా పరీక్షలు చేస్తున్న పలు ల్యాబ్‌లను గుర్తించామన్నారు. ప్రైవేట్ లాబ్‌లు.. పోర్టల్‌లో నమోదుచేస్తోన్న పరీక్షల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్యలో ఉన్న అవకతకలపై పరిశీలన ప్రారంభమైనట్లు తెలిపారు.
70 శాతం మందికి పాజిటివ్..
కొన్ని ల్యాబ్‌ల్లో చేస్తున్న పరీక్షల్లో 70 శాతం కరోనా పాజిటివ్ నిర్ధరణకావడం చూస్తే లోపాలున్నట్లు అర్థమవుతోందన్నారు. దీనిపై నిపుణుల కమిటీ నిశితంగా పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు.
పరీక్షల సంఖ్య పెంచండి
ప్రైవేటు ల్యాబ్‌లో జరుగుతున్న పరీక్షల తీరుపై.. నిరంతర పర్యవేక్షణ, వాలిడేషన్ కొనసాగుతుందని ఈటల తెలిపారు. అన్ని ల్యాబ్‌లు ఐసీఎంఆర్, ప్రభుత్వ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షల సంఖ్య పెంచే అంశంపైనా మంత్రి సమీక్షించారు. 6,600 పరీక్షల సామర్థ్యంతో పనిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం నుంచి విధుల్లోకి టిమ్స్ సిబ్బంది
ఈ సందర్భంగా టిమ్స్‌లో ఐపీ సేవలు ప్రారంభించేందుకు కావాల్సిన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తైందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. సోమవారం నుంచి వైద్యులు, సిబ్బంది విధుల్లో చేరనున్నట్టు ప్రకటించారు.
ఇవే ఆస్పత్రులు..
సీజన్ మారటంతో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయని.. ఇంటింటి సర్వే చేసి కరోనా లక్షణాలు నిర్ధరణ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జంట నగరాల్లో కొవిడ్ వైరస్ వ్యాప్తి జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు కింగ్ కోటి ఆస్పత్రి, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, కొండాపూర్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకావోలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.