బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో భాగంగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర తలసరి ఆదాయం.. లక్షా 12వేల 162 నుంచి 2 లక్షల 28వేల 216కు పెరిగిందని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో దేశం ఆర్థికంగా వెనకబడినా....ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామని ప్రసంగంలో పేర్కొన్నారు.
సమర్థంగా ఎదుర్కొన్నాం..
కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని తమిళిసై వ్యాఖ్యానించారు. వైరస్ కట్టడి, మరణాల నియంత్రణలో రాష్ట్రం దేశంలోనే ముందుందని పేర్కొన్నారు. దేశంలో మరణాల సగటు 1.4 ఉంటే రాష్ట్ర సగటు 0.54 ఉండటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. వైద్యం అందించడంలోనూ తెలంగాణ ముందుందన్న గవర్నర్.. 97.88 శాతం రికవరీ రేటుతో దేశం కంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని వెల్లడించారు.
ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
కొత్త రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించామని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు.. మిషన్ కాకతీయ ద్వారా 30వేల చెరువులు పునరుద్ధరించామని వివరించారు. నీటి వివాదాలు స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడంతో పాటు....పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు.
ప్రథమ ప్రాధాన్యం రైతుకే..
ప్రభుత్వ పథకాలు, చర్యలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా అవతరించిందని తమిళిసై స్పష్టం చేశారు. రైతుకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ.. వ్యవసాయరంగంలో గణనీయ వృద్ధి సాధించామని చెప్పారు. ఉచిత విద్యుత్, సాగునీరు, మార్కెటింగ్ సౌకర్యాలు, రైతుబంధు, రైతుబీమా సాయంతో.. రాష్ట్రంలో అన్నదాతలు ప్రస్తుతం ధైర్యంగా సాగు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి కోటి 41 లక్షల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం.. 2కోట్ల 10లక్షలకు చేరుకోవడమే.. రైతులపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని గవర్నర్ తెలిపారు.
విప్లవాత్మక సంస్కరణ..
వ్యవసాయ భూముల విషయంలో ధరణి పోర్టల్ ఓ విప్లవాత్మక సంస్కరణగా నిలిచిందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. భూ యాజమాన్య హక్కుల గందరగోళం తొలగిపోయిందని .. భూ రికార్డుల విషయంలో ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకత తీసుకొచ్చిందని తెలిపారు.
మరో మణిహారం..
రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అమలు చేసిందని తమిళిసై అన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గించడమే లక్ష్యంగా.. ప్రభుత్వం పట్టుదలతో కేంద్రం నుంచి రీజినల్ రింగ్ రోడ్‌ను సాధించుకుందని తెలిపారు. హైదరాబాద్‌కు మరో మణిహారంగా మారనున్న రీజినల్ రింగ్ రోడ్‌కు త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి.. పనులు ప్రారంభించబోతోందని ప్రకటించారు.
కరోనా సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన ధైర్యం, తీసుకున్న చర్యలు.. లాక్డౌన్ అనంతరం అభివృద్ధి పథంలో తెలంగాణ సాగుతున్న తీరును.. సంక్షేమ పథకాల అమల్లో నెంబర్ వన్‌గా నిలిచిన సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు అభినందించిందని గవర్నర్ తమిళిసై తెలిపారు.