జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్... వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని సీఎం అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్ఞంలో.. వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోషించాలన్న కేసీఆర్... ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని వైద్యులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారన్న ఆయన... బాధల నుంచి శరీరాన్ని, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే వైద్యులన్నారు. కరోనా సహా అన్ని ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు ప్రశంసనీయమైనవని కొనియాడారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలందించిన ప్రతి వైద్యుడు, వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ అభినందించారు.
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఇప్పటికే పలు వైద్య కళాశాలలను ప్రభుత్వం నెలకొల్పిందని సీఎం తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా అన్ని రకాల రోగ నిర్ధారణ కేంద్రాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభమైందని ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని స్థాయిల్లోని ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచామన్న ఆయన బస్తీ దవాఖానాల ఏర్పాటుతో వైద్యుల సేవలను గల్లీల్లోని సామాన్యుల చెంతకు చేర్చామని చెప్పారు.
వైద్యులు సహా అన్ని రకాల వైద్య సిబ్బందిని నియమించడం, పదోన్నతులు కల్పించడం, మెరుగైన రీతిలో జీతభత్యాలు పెంచినట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే వైద్య, ఆరోగ్య శాఖలో 20 వేల కొత్త పోస్టులను మంజూరు చేయడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందన్నారు. రానున్న కాలంలో ఖర్చుకు వెనకాడకుండా ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వైద్యులు, నర్సులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.
వైద్యులను కాపాడుకోవాలని..
జులై 1 జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో డాక్టర్లందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ఆపత్కాల సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా నిర్విరామంగా పోరాడుతున్న వైద్యాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాణాలకు ముప్పున్నా రోగుల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా నిబద్ధత, ధైర్యంతో వైద్యులు ముందుకు సాగుతున్నారని కొనియాడారు. అలాంటి వైద్యుల సేవలను గుర్తించి గౌరవించుకోవడం మన బాధ్యతన్నారు.
భారతరత్న డాక్టర్ బిదన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఏటా నిర్వహించుకొనే వైద్యుల దినోత్సవం వారిని గౌరవించడానికి ఇదే సరైన సందర్భమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులను రక్షించుకోవాలని.. వైద్యో రక్షతి రక్షితః అంటూ వారి సేవలను గవర్నర్ తమిళిసై అభినందించారు.
ఇదీచూడండి: Vaccine: జులై 3 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు