Basti Dawakhana in Municipality:పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ఇతర పట్టణాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వచ్చే ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొంది.
జూన్ 2 నాటికి..
పట్టణాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటు విషయమై వైద్యారోగ్య, పురపాలక శాఖలు.. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సంయుక్తంగా చర్చించాయి. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని, ఇదే స్ఫూర్తితో 141 మున్సిపాలిటీల్లో మరో 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రెండు దశల్లో వచ్చే జూన్ 2 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 544 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అన్నింటా శాంపిల్స్ సేకరణ..
జనాభా సంఖ్య, వైద్య సేవల అందుబాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాలను పురపాలకశాఖ, వైద్య పరికరాలను వైద్యారోగ్య శాఖ సమకూరుస్తాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. టీ డయాగ్నొస్టిక్ సహకారంతో కొత్తగా ఏర్పాటు చేసే బస్తీ దవాఖానాల్లో ఎక్కడికక్కడే శాంపిల్స్ సేకరిస్తారని చెప్పారు.
ఆరోగ్యసూచిపై ర్యాంకింగ్‌పై కేటీఆర్ హర్షం..
Ktr on health Rankings: నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడంపై మంత్రి హరీశ్ రావు, ఆరోగ్య సిబ్బందికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షత వల్ల ప్రభుత్వ వైద్యరంగం ముందుకు దూసుకెళ్తోందన్న ఆయన.. నిరుడు నాల్గో స్థానంలో నుంచి ఈ ఏడాది మూడో స్థానానికి చేరడం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది ఆరోగ్యసూచీలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. బస్తీ దవాఖానాల పనితీరు బాగుందని, తమ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయాలని చాలా వినతులు వస్తున్నాయని చెప్పారు. ఐటీ శాఖ నుంచి వైద్యారోగ్య శాఖకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు.
జీహెచ్ఎంసీలో 259 బస్తీ దవాఖానాలు..
జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు 2 చొప్పున 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 259 ఏర్పాటుచేశారు. ఈ బస్తీ దవాఖానాల్లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు అందిస్తారు. ఇవే కాకుండా నగరంలో 85 అర్బన్ హెల్త్ సెంటర్లూ వైద్య సేవలు అందిస్తున్నాయి. ఈ బస్తీ దవాఖానాల్లో అవుట్ పేషెంట్ సేవలు అందించడం సహా బీపీ, షుగర్‌తో పాటు 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారు. ఇక్కడ సేకరించిన నమూనాలను తెలంగాణ స్టేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపిస్తారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తారు. స్వల్పకాల అనారోగ్యానికి తక్షణ వైద్య చికిత్సలు అందించడం సహా టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారు.
ఇదీచూడండి: