కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో గత నెల 23 నుంచి లాక్‌డౌన్ అమలవుతోంది. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ నెలాఖరు వరకు ఇలాగే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వచ్చే నెల మూడో తేదీ వరకు కొనసాగుతుందని ప్రకటించింది. అదే సమయంలో ఈ నెల 20 నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. పలు రంగాలకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగేలా మినహాయింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్రాలకు అధికారిక సమాచారం ఇచ్చింది. అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించి సడలింపుల విషయమై చర్చించారు.
పకడ్బందీ చర్యలు
రాష్ట్రంలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారితోపాటు వారి ప్రైమరీ కాంటాక్ట్‌ల్లో ఇంకా కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వారి కాంటాక్టుల గుర్తింపు సహా నమూనా పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన సడలింపులు రాష్ట్రంలో ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయంపై.. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో మొత్తం 239 కంటైన్‌మెంట్ జోన్లు ప్రకటించగా... హైదరాబాద్‌లోనే 139 ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తి చెందకుండా చూస్తున్నారు.
ఇంకొన్నాళ్ల పాటు పటిష్ఠంగా అమలు
ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన మినహాయింపులు రాష్ట్రంలో అమలు చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. సడలింపులు ఇచ్చాక దురదృష్టవశాత్తూ ఎవరైనా పాజిటివ్ ఉన్న వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందితే సమస్య ఇంకా తీవ్రం అవుతుందన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల పాటు లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలన్న ఆలోచనతోనే సర్కార్ ఉన్నట్లు కనిపిస్తోంది.
కేబినెట్ భేటీలో నిర్ణయం!
రాష్ట్రంలో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తామని కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. లాక్‌డౌన్ కొనసాగింపు, సడలింపుల విషయమై చర్చించేందుకు ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్రంలో కరోనా స్థితిని పూర్తి స్థాయిలో సమీక్షించి లాక్‌డౌన్ కొనసాగింపుపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన సడలింపులు రాష్ట్రంలో ఇవ్వాలా... వద్దా... అన్న విషయమై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.
ఇదీ చూడండి: ఈనెల 19న మంత్రివర్గ సమావేశం.. లాక్‌డౌన్‌పై చర్చ