పాఠశాలల్లో తరగతులను ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా నాలుగు నెలలుగా రాష్ట్రంలోని సుమారు 40 వేల బడులు మూత పడ్డాయి. జూన్ 1 నుంచి పలు కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు వివిధ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ తరగతులు మొదలుపెట్టాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు.
కరోనా పరిస్థితులు ఎన్నాళ్లకు చక్కబడతాయో స్పష్టత లేకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ బోధనా పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఈనెల 3న విద్యాశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా గ్రామీణ, పేద విద్యార్థులకు ఇళ్ల వద్దకే విద్య ఎలా అందించాలనే అంశంపై కమిటీ అధ్యయనం చేసింది. దాదాపు అందరి ఇళ్లల్లో టీవీలు ఉన్నందున.. వాటి ద్వారా పాఠాలు బోధించాలని ఆ కమిటీ సూచించింది. ఒకరిద్దరు విద్యార్థులకు ఆ సౌకర్యం లేనట్లయితే.. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయంలోని టీవీలను ఉపయోగించాలని సిఫార్సు చేసింది. దూరదర్శన్ యాదగిరి, టీ-శాట్ విద్య ఛానెళ్ల ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. అవసరమైతే స్థానిక కేబుల్ టీవీలను ఉపయోగించాలని భావిస్తున్నారు.
ఆరో తరగతి నుంచి..
టీవీల ద్వారా 6 నుంచి 10 తరగతుల వరకు రోజుకు నాలుగు గంటల పాటు పాఠాలను బోధించాలని ఆలోచిస్తున్నారు. టీ-శాట్‌లో ప్రత్యేక ఛానెల్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని విద్యా శాఖ ప్రభుత్వాన్ని కొరనుంది.
ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు..
ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు వర్క్ షీట్ల ద్వారా బోధించేలా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రైవేట్ బడుల విద్యార్థుల కోసం మార్కెట్‌లో పుస్తకాలను సిద్ధం చేసింది. ప్రైవేటు విద్యాసంస్థలు.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో పాఠాలు మొదలు పెట్టిన వాటిని క్రమబద్ధీకరించి, పద్ధతి ప్రకారం జరిగేలా మార్గదర్శకాలను రూపొందించింది. విద్యాశాఖ కమిటీ రూపొందించిన ముసాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
త్వరలో పాలసీ..
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం దాదాపు కోటిన్నర పాఠ్య పుస్తకాలు సిద్ధం చేశారు. ఈ నెల 20లోగా పాఠాశాలకు చేర్చి.. 25 లోగా విద్యార్థులకు చేర్చాలని ఇటీవల డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై విద్యా శాఖ ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం ఈ వారంలో పాలసీని ప్రకటించనుంది.
ఇవీచూడండి: తెలంగాణలో కొత్తగా 1,524 కరోనా కేసులు, 10 మంది మృతి