Basti Dawakhana Recruitment: పల్లె, బస్తీ దవాఖానాలకు మరింత జవసత్వాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 956 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. వీటిని ‘మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ)’ పేరిట భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన జరిగే వీటి భర్తీకి సంబంధించిన మార్గదర్శక ఉత్తర్వులను వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసింది.
అందుబాటులోకి వైద్యుల సేవలు.. చలి జ్వరమో, వాంతులూ విరేచనాలో.. ఏదో ఒక సాధారణ సమస్యతో రోగి దవాఖానాకు వెళ్తే అక్కడ వైద్యుడు నాడి పడితేనే ఊరట. ఓ ఇంజక్షన్‌తో పాటు నాలుగు మాత్రలు రాసిచ్చి పంపిస్తేనే ఉపశమనం. అదే ఆసుపత్రిలో వైద్యుడు లేకపోతే ఇక సేవలెలా అందేది? రాష్ట్రంలో మొత్తం 4,744 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. ఏ ఉపకేంద్రం నుంచి వైద్యుడిని సంప్రదించాలన్నా 15-30 కి.మీ. ప్రయాణించాల్సిన పరిస్థితులున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య ఉపకేంద్రాల్లో లభించే సేవలన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యుల సూచనల మేరకు అందజేసేవే. ప్రధానంగా వైద్యుడు లేకపోవడం ఇక్కడ పెద్దలోటు. కేవలం టీకాలు, అధిక రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నెలనెలా మందులివ్వడానికే ఈ కేంద్రాల సేవలు పరిమితమవుతున్నాయి. ఉపకేంద్రాల్లో ఏఎన్‌ఎంలే అందుబాటులో ఉండడంతో వైద్యుల కోసం ప్రజలు సుదూర ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. లేదంటే డబ్బులు పెట్టి ఆర్‌ఎంపీలు అందించే చికిత్సతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.. ఈ సమస్యను అధిగమించాలనే తెలంగాణ ప్రభుత్వం ‘పల్లె దవాఖానా’ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. బస్తీ దవాఖానాల్లో వైద్యుడిని నియమించడం ద్వారా అవి ఇప్పటికే విజయవంతమవడంతో.. పల్లె దవాఖానాల్లోనూ వారి అందుబాటు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు లభిస్తాయని సర్కారు భావిస్తోంది.
నియామక మార్గదర్శకాలు.. పట్టణాలు, పల్లెల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలను బస్తీ, పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దనుండడంతో వాటిలో ఎంఎల్‌హెచ్‌పీల సేవలు అవసరమవుతాయి.
పురపాలక పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో(బస్తీ దవాఖానాలు) ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎంఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ అర్హత కలిగినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
పురపాలక కాని ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో(పల్లె దవాఖానాలు)ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేయడానికీ పై అర్హతలు, నిబంధనలే వర్తిస్తాయి.
పల్లె దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎంస్ వైద్యులు ముందుకు రాకుంటే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులను లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రొగ్రామ్‌ను పూర్తిచేసిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్/బీఏఎంఎస్ వైద్యులకు నెలకు 40వేలు, స్టాఫ్‌నర్సులకు నెలకు 29,900 చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లిస్తారు.
ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషన్ చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఆదేశించారు.