ఫిబ్రవరి 1న విద్యా సంస్థలు ప్రారంభించాలని నిర్ణయించినందున.. విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ యాజమాన్యాలు ఈనెల 25 నాటికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. తొమ్మిది, పది, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు తరగతుల వారిగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ నెల 20 లోగా సమర్పించాలని మంత్రి కోరారు.
18న సమావేశం
జిల్లాల్లోని విద్యా సంస్థలపై జిల్లా కలెక్టర్ల ద్వారా నివేదికలు రూపొందించాలని అధికారులను సబితా ఆదేశించారు. విద్యా సంస్థల్లో భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు సమకూరుస్తారని తెలిపారు. జిల్లా, మండల విద్యాధికారులు అన్ని పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ నెల 18న ఆయా మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
19న ప్రైవేట్ విద్యాసంస్థలతో భేటీ
ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రైవేట్ విద్యా సంస్థలు కచ్చితంగా పాటించాలని.. ఈనెల 19న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, సాంకేతిక, కళాశాల విద్యా శాఖల కమిషనర్ ననీన్ మిత్తల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : కిడ్నాప్ ప్లాన్ ఎవరిది.. అప్పుడు అఖిలప్రియ ఎక్కడున్నారు?