TS Budget 2022 Exercise : తెలంగాణ బడ్జెట్ సమావేశాలను మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనంతరం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 11 వరకు పార్లమెంట్‌లో మొదటి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం ఫిబ్రవరిలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించవచ్చని గత నెల వరకు అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజులుగా కరోనా కేసుల తీవ్రత పెరగడంతో.. ఫిబ్రవరిలో సమావేశాల నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. కరోనాను దృష్టిలో పెట్టుకొని బయో ఆసియా అంతర్జాతీయ సదస్సును ఫిబ్రవరి 24, 25 తేదీల్లో దృశ్యమాధ్యమంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఫిబ్రవరిలో కరోనా కేసులు తగ్గితే మార్చి మొదటి వారంలో శాసనసభ, మండలిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి, 10 నుంచి 14 రోజులు నిర్వహించాలనే అంశంపై సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ కార్యక్రమాలు.. మార్చి 21 నుంచి 28 వరకు జరగనున్నాయి. దీనిని కూడా దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ సమావేశాలపై సీఎం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: New Districts in AP: ఏపీలో ఇక 26 జిల్లాలు.. నోటిఫికేషన్ విడుదల