Medical Seats Allocation in Telangana : ప్రస్తుత ఇన్‌సర్వీస్ కోటా విధానాన్ని మార్చాలని వైద్యారోగ్యశాఖ యోచిస్తోంది. ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తూ.. తిరిగి ఆ స్పెషలిస్టు వైద్యులను ప్రభుత్వ వైద్యంలో వినియోగించుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆరోగ్యశాఖ భావిస్తోంది. సర్కారు దవాఖానాల్లోని అవసరాల ప్రాతిపదికనే.. హేతుబద్ధంగా పీజీ సీట్లను కేటాయించాలనే అంశం ఇటీవల ఉన్నతాధికారుల సమావేశంలో చర్చకొచ్చినట్లుగా తెలిసింది.
Telangana Medical Seats Allocation : ప్రభుత్వ వైద్యంలో పీహెచ్‌సీల్లో సేవలందిస్తున్న ఎంబీబీఎస్ వైద్యులకు ఉన్నత స్థాయి వైద్యవిద్య అందించి, వారు స్పెషలిస్టు వైద్యులుగా తిరిగి ప్రభుత్వ వైద్యంలో సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇన్‌సర్వీస్’ కోటాను గతంలో ప్రారంభించింది. దీని కింద పీజీ సీట్లలో సుమారు 157 క్లినికల్ సీట్లు, 82 నాన్, పారా క్లినికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి పీజీ వైద్యవిద్య తొలివిడత ప్రవేశాల్లో ఇన్‌సర్వీస్ కోటా కింద ఉన్న మొత్తం సీట్లలో 63 క్లినికల్ సీట్లు మిగిలిపోగా.. మొత్తం 82 పారా, నాన్ క్లినికల్ సీట్లు మిగిలిపోయాయి. మరోపక్క అవసరాలకు మించి ఇతర కోర్సుల్లో చేరడం వల్ల.. వారందరి సేవలను తిరిగి వినియోగించుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి.
నేడు, రేపు వైద్యుల కౌన్సెలింగ్
ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ పూర్తి చేసి, తిరిగి ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న 290 మంది స్పెషలిస్టు వైద్యులకు ఈనెల 23, 24 తేదీల్లో కోఠిలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.